రాజకీయ పార్టీలన్నీ ఉచితాలవైపే 

24 Aug, 2022 04:20 IST|Sakshi

న్యూఢిల్లీ: బీజేపీతో సహా రాజకీయ పార్టీలన్నీ ఉచిత హామీల పక్షమేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. అందుకే ఏవి ఉచితాలో, ఏవి సంక్షేమ పథకాలో తేల్చేందుకు న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాల్సి వచ్చిందన్నారు. ఎన్నికల వేళ ఉచిత హామీలిచ్చే పార్టీల గుర్తింపును రద్దు చేయాలంటూ దాఖలైన వ్యాజ్యంపై జస్టిస్‌ రమణ, జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ సీటీ రవికుమార్‌ల ధర్మాసనం మంగళవారం విచారించింది. ‘ఉచితాలు అందరికీ కావాల్సిందే. పార్టీలు  ఈ విషయంలో ఒక్కతాటిపై ఉన్నాయి. అందుకే దీనిపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాలన్న ఉద్దేశంతోనే మేం జోక్యం చేసుకున్నాం’’ అని జస్టిస్‌ రమణ ఈ సందర్భంగా అన్నారు.

ఉచితాలపై డీఎంకే చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘వాళ్ల తీరు నిజంగా దురదృష్టకరం. ఇంకా చాలా అనాలనుకున్నా నేను సీజేఐగా ఉన్న కారణంగా ఇక్కడితో సరిపెడుతున్నా. అయితే తెలివితేటలు కేవలం ఒక్క వ్యక్తికో, పార్టీకో పరిమితం కాదని గుర్తుంచుకోండి’’ అంటూ డీఎంకే తరఫు న్యాయవాది పి.విల్సన్‌ను ఉద్దేశించి ఆగ్రహం     వెలిబుచ్చారు. 

ప్యానల్‌ కావాలి: సిబల్‌ 
ఉచితాల అంశాన్ని ఒక నిర్దిష్ట వ్యవస్థ ద్వారా పరిష్కరించాలని సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ అభిప్రాయపడ్డారు. ‘వీటి కట్టడికి కేంద్ర ఆర్థిక సంఘం పర్యవేక్షణలో చట్టబద్ధ అధికారాలతో ఓ ప్యానల్‌ను ఏర్పాటు చేయాలి. ఉచితాలు బడ్జెట్లో 3 శాతం మించకుండా చూడాలి. ఒకవేళ మించితే ఆ తర్వాత ఏడాదిలో సదరు రాష్ట్రానికి ఆర్థిక సంఘం ఆ మేరకు కేటాయింపులను తగ్గించాలి’’ అని సూచించారు. దీనిపై ఇంకా చర్చ జరిగి ఇలాంటి సూచనలు చాలా రావాలని సీజేఐ అభిప్రాయపడ్డారు. ‘కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పేదలకు సైకిళ్లు ఇస్తున్నాయి.

వాటివల్ల వారి జీవన విధానం మెరుగైందని పలు నివేదికలు చెబుతున్నాయి. మారుమూల గ్రామానికి చెందిన ఓ నిరుపేద జీవనోపాధికి సైకిళ్లు, చిన్న పడవలపై ఆధారపడవచ్చు. దీనిపై మనమిక్కడ కూర్చుని వాదించి నిర్ణయించలేం’’ అన్నారు. సంక్షేమ పథకాలను ఎవరూ వద్దనరని, టీవీల వంటివాటిని ఉచితంగా పంచడంపైనే అభ్యంతరమని కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అన్నారు.  ఉచిత పథకాలను నిధులెలా సమీకరిస్తారన్నది ఎన్నికల మేనిఫెస్టోలోనే పార్టీలు స్పష్టంగా చెప్పాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు అన్నారు.  

మరిన్ని వార్తలు