Himachal Election Results: కాంగ్రెస్‌ ఘన విజయం.. సీఎం రాజీనామా

8 Dec, 2022 15:40 IST|Sakshi

షిమ్లా: గుజరాత్‌ ఎన్నికల్లో భారీ ప్రభంజనం సృష్టించిన బీజేపీ.. హిమాచల్‌ ప్రదేశ్‌లో పరాజయాన్ని చవిచూసింది. దీంతో రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించి ఏ పార్టీతో పొత్తు లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది.  ఇక ఆప్‌.. కనీసం ఖాతా కూడా తెరవలేదు.

ఈ నేపథ్యంలో హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌ రాజీనామా చేశారు. తన రాజీనామాను గవర్నర్‌కు పంపినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రజల తీర్పును శిరసావహిస్తానని తెలిపారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రజల హామీలను నెరవేర్చాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి తోడ్పడతామని తెలిపారు. కాగా మండీ జిల్లాలోని సిరాజ్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిపై జైరాం ఠాకూర్‌ గెలుపొందారు.

కాంగ్రెస్‌ విజయ కేతనం
హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 68 సీట్లకు గానూ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ఫిగర్‌ 35ను దాటేసింది. ఇప్పటికే 37 స్థానాల్లో స్పష్టమైన విజయం సాధించింది. మరో 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక బీజేపీ 23 స్థానాల్లో గెలుపొందగా.. 3 చోట్ల ముందంజలో ఉంది. ఇతరులు మూడు సీట్లను గెలుచుకున్నారు. 
చదవండి: గుజరాత్‌ సీఎంగా భూపేంద్ర పటేల్‌.. ప్రమాణం ఎప్పుడంటే?

మరిన్ని వార్తలు