ఈ చిన్నారులకు దిక్కెవరూ...!  

13 Nov, 2020 15:10 IST|Sakshi

విధి వెక్కిరిస్తే జీవితం వింత నాటకంలా మారిపోతుంది. ఆ నాటకంలో ఎవరైనా సమిధులు కావాల్సిందే... ఇదే పరిస్థితి అభం..శుభం తెలియని ఇద్దరి చిన్నారులకు ఎదురైంది. ఉన్న తల్లి ఎక్కడుందో తెలియదు. మద్యానికి బానిసై ఇబ్బందులు పెడుతున్న నాన్నను నాన్నమ్మే హతమార్చింది. ఆమెపై కేసు నమోదైంది. దీంతో చిన్నారుల జీవిత పయనమెటో తెలియని దయనీయ పరిస్థితి నెలకొంది. ఆ చిన్నారులను చూసి అంతా అయ్యో..పాపం అంటున్నారు... వారిని అక్కున చేర్చుకునేదెవరన్నది ప్రశ్నార్థకంగా మారింది

భువనేశ్వర్‌ : ఇద్దరు చిన్నారుల జీవితాలతో విధి ఆడుకుంది. తల్లిదండ్రుల మధ్య సఖ్యత లేకపోవడంతో నాలుగేళ్ల కిందట ఆ చిన్నారుల తల్లి తన భర్తను, పిల్లలను వదిలి వెళ్లిపోయింది. తండ్రి మద్యానికి బానిసై ఉన్న కుటుంబ సభ్యులను నిత్యం విసిగించడంతో విసిగిపోయిన కన్నతల్లే క్షణికావేశంలో హతమార్చింది. మూడేళ్ల కిందట చిన్నారుల తాతయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. ఉపాధి కోసం పెదనాన్న వలసబాట పట్టాడు. మేనత్త సాకుతుందా! అంటే ఆమెది రెక్కాడితేగాని కడుపు నిండని దయనీయ స్థితి. ఈ పరిస్థితుల్లో ఆ చిన్నారులకు దిక్కెవరన్నది ప్రశ్నార్ధకంగా మారింది. మక్కువ మండలం కొండబుచ్చమ్మపేట గ్రామానికి చెందిన జానకి గౌరీశంకర్, కమల దంపతులు. వీరికి హారిక, చరణ్‌తేజ సంతానం. తల్లిదండ్రులిద్దరూ గుంటూరు పట్టణం వలసవెళ్లి ఓ ప్రైవేటు కంపెనీలో పని చేసుకుంటూ జీవించేవారు.

కొన్నాళ్లు గడిచాక గౌరీశంకర్‌ మద్యానికి బానిసై భార్య కమలను నిత్యం వేధించడంతో విసిగిన ఆమె భర్తను ఇద్దరు చిన్నారులను విడిచిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయింది. దీంతో చేసేదిలేక గౌరీశంకర్‌ తన ఇద్దరు చిన్నారులతో గుంటూరు వీడి కొండబుచ్చమ్మపేట గ్రామానికి వచ్చి ఓ అద్దె ఇంట్లో ఉండేవాడు. గౌరీశంకర్‌ మద్యానికి బానిస కావడంతో చిన్నారుల ఆలనాపాలన నాన్నమ్మ ఈశ్వరమ్మ చూస్తుండేది. ఈశ్వరమ్మకు ప్రభుత్వం అందిస్తున్న వితంతు పింఛనే జీవనాధారం. ఈ క్రమంలో ఈశ్వరమ్మను కన్నకొడుకు గౌరీశంకర్‌ మద్యం కోసం నిత్యం నగదు కావాలని వేధించేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి తల్లీకొడుకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. క్షణికావేశంలో ఈశ్వరమ్మ కన్నకొడుకు గౌరీశంకర్‌ను హతమార్చింది. దీంతో చిన్నారుల తండ్రి లేకుండాపోయాడు.

నాన్నమ్మ ఈశ్వరమ్మ రిమాండ్‌కు వెళ్లనుంది. ఇలా తల్లి ఉన్నా ఎక్కడ ఉందో తెలియక, తండ్రి హతమవగా.. ఇన్నాళ్లు తమ ఆలనాపాలన చూసిన నాన్నమ్మ రిమాండ్‌కు వెళ్లనుండడంతో ఈ చిన్నారుల పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్ధకమైంది. మేనత్త ఉన్నా పేదరికంలో కొట్టుమిట్టాడుతోంది. హారిక ఐదో తరగతి, చరణ్‌తేజ రెండో తరగతి గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. ఈ పరిస్థితుల్లో చిన్నారులు హారిక, చరణ్‌తేజ జీవన పయనమెటు? అన్నది అందరి మదిలో తొలిచే ప్రశ్న.

మరిన్ని వార్తలు