ఎట్టకేలకు దిగొచ్చిన చైనా

20 Feb, 2021 04:48 IST|Sakshi
గల్వాన్‌ లోయలో భారత్, చైనా సైనికులు ఘర్షణకు దిగిన (ఫైల్‌)

గల్వాన్‌ లోయ ఘర్షణలో నలుగురిని కోల్పోయాం

పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ అధికారిక ప్రకటన

న్యూఢిల్లీ/బీజింగ్‌:  తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో గతేడాది జూన్‌ 15న భారత సైన్యంతో జరిగిన భీకర ఘర్షణలో తమకు ఎలాంటి నష్టం వాటిల్లలేదంటూ ఇన్నాళ్లూ బొంకిన చైనా ప్రజా విముక్తి సైన్యం(పీఎల్‌ఏ) ఎట్టకేలకు మౌనం వీడింది. నాలుగు దశాబ్దాల తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన అతి పెద్ద ఘర్షణగా రికార్డుకెక్కిన ఈ ఘటనపై దాదాపు ఎనిమిది నెలల తర్వాత మొదటిసారిగా స్పందించింది. భారత సైన్యం చేతిలో పెద్ద సంఖ్యలో చైనా సైనికులు హతమయ్యారని ప్రపంచమంతా నమ్ముతున్నప్పటికీ అర్ధసత్యాన్నే బయటపెట్టింది. ప్రజలకు వాస్తవాలు చెబుతున్నామంటూ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించింది. గల్వాన్‌ ఘర్షణలో తమ సైనికులు కేవలం నలుగురు ప్రాణాలు కోల్పోయారని శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. వారి త్యాగాలను స్మరించుకుంటూ, సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌ ఆఫ్‌ చైనా(సీఎంసీ) వారికి మరణానంతర శౌర్య పురస్కారాలను ప్రదానం చేసినట్లు పీఎల్‌ఏ తెలియజేసింది.

కనీసం 45 మంది చైనా సైనికులు మృతి!
గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణలో తమ సైనికులు 20 మంది మృతిచెందినట్లు భారత సైన్యం ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిలో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన కల్నల్‌ బి.సంతోష్‌బాబు కూడా ఉన్నారు. అయితే, ఈ ఘటనలో చైనా సైన్యం 30 మందిని కోల్పోయినట్లు అప్పట్లో భారత్‌ వెల్లడించింది. కనీసం 45 మంది చైనా సైనికులు మరణించి ఉంటారని రష్యా అధికారిక న్యూస్‌ ఏజెన్సీ టీఏఎస్‌ఎస్‌ అంచనా వేసింది. గల్వాన్‌ ఘటనలో చైనా సైన్యానికి సంభవించిన నష్టంపై రకరకరాల ప్రచారాలు సాగుతున్నాయని, వాటికి అడ్డుకట్ట వేసి, ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలన్నదే తమ ప్రయత్నమని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్‌యింగ్‌ చెప్పారు. అందుకే మృతుల వివరాలు బయటపెట్టామని అన్నారు. తమ సైనికుల త్యాగాలను ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని చెప్పారు.  

నేడు భారత్‌–చైనా మధ్య చర్చలు
పాంగాంగ్‌ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాల నుంచి భారత్, చైనా సైనిక బలగాలను, ఆయుధాలను పూర్తిగా ఉపసంహరించుకున్నాయి. హాట్‌ స్ప్రింగ్స్, గోగ్రా, డెస్పాంగ్‌ నుంచి బలగాలను వెనక్కి తీసుకోవడంపై  చర్చించేందుకు భారత్, చైనా మధ్య ఉన్నతస్థాయి సైనిక చర్చలు జరుగనున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. కమాండర్‌ స్థాయి పదో దఫా చర్చలు ఎల్‌ఏసీ వద్ద చైనా భూభాగంలో మోల్డో బోర్డర్‌ పాయింట్‌లో శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయని వెల్లడించాయి. పాంగాంగ్‌ సరస్సు నుంచి బలగాలను వెనక్కి తీసుకున్న తర్వాత  జరిగే తొలి చర్చలు ఇవే.

మరిన్ని వార్తలు