కాల్పులకు తెగబడ్డ చైనా 

9 Sep, 2020 03:52 IST|Sakshi
తూర్పు లద్దాఖ్‌లో ఎల్‌ఏసీ వైపు వెళ్తున్న ఆర్మీ ట్రక్కులు  

తూర్పు లద్దాఖ్‌లో మరో దుస్సాహసం

భారత సైనికులను బెదిరించేందుకు గాల్లోకి కాల్పులు 

భారత బలగాలే మొదట కాల్పులు జరిపాయంటూ ఎదురుదాడి 

తిప్పికొట్టిన భారత్‌; చైనానే కాల్పులు జరిపిందని స్పష్టీకరణ 

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో తరచుగా ఉద్రిక్తతలు సృష్టిస్తూ.. భారత్‌ను కవ్విస్తున్న చైనా మరోసారి తెంపరితనం చూపింది. తూర్పు లద్దాఖ్‌లో ప్యాంగాంగ్‌ సరస్సు సరిహద్దుల్లో భారత దళాలకు హెచ్చరికగా గాలిలో కాల్పులు జరిపి దుస్సాహసానికి తెగబడింది. సరిహద్దు ఘర్షణల సమయంలో కాల్పులకు పాల్పడకూడదన్న ఒప్పందాన్ని ఉల్లంఘించింది. 1975 నాటి ఘర్షణల అనంతరం చైనా సరిహద్దుల్లో  కాల్పుల ఘటన చోటు చేసుకోవడం ఇదే ప్రథమం. చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) దళాలు గాలిలో కాల్పులు జరిపాయని, సరిహద్దుల్లోని భారత్‌ పోస్ట్‌ను స్వాధీనం చేసుకునేందుకు విఫల యత్నం చేశాయని మంగళవారం భారత సైన్యం ప్రకటించింది.

వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)ను దాటి వచ్చి భారత దళాలే కాల్పులు జరిపాయన్న చైనా ఆరోపణలను ఖండించింది. ‘వాస్తవాధీన రేఖను భారత సైన్యం దాటి వెళ్లలేదు. కాల్పులు సహా ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడలేదు. భారత్, చైనాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాలను చైనా సైన్యమే యథేచ్ఛగా, ఏకపక్షంగా ఉల్లంఘిస్తూ దుందుడుకు చర్యలకు పాలుపడ్తోంది’ పేర్కొంది. ‘సెప్టెంబర్‌ 7వ తేదీన వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న భారత ఫార్వర్డ్‌ పోస్ట్‌ను చుట్టుముట్టి, స్వాధీనం చేసుకోవాలని చైనా ప్రయత్నించింది. భారత దళాలు ఆ ప్రయత్నాన్ని విజయవంతంగా అడ్డుకున్నాయి. ఆ సమయంలో భారతీయ సైనికులను భయపెట్టేందుకు చైనా సైన్యం గాలిలో కొన్ని రౌండ్లు కాల్పులు జరిపింది’ అని భారత సైన్యం వివరించింది. ఉద్రిక్తతలను తగ్గించుకుని, శాంతి నెలకొనేందుకు భారత్‌ కట్టుబడి ఉన్నప్పటికీ.. చైనా మాత్రం రెచ్చగొట్టే చర్యలను కొనసాగిస్తోందని ఆరోపించింది.

భారత సైన్యం వాస్తవాధీన రేఖను దాటి వచ్చి, చర్చల కోసం ముందుకు వస్తున్న చైనా సరిహద్దు గస్తీ దళాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాయని సోమవారం రాత్రి చైనా సైన్యానికి చెందిన వెస్ట్రన్‌ థియేటర్‌ కమాండ్‌ అధికార ప్రతినిధి సీనియర్‌ కల్నల్‌ ఝాంగ్‌ షుయిలీ ఒక ప్రకటనలో ఆరోపించారు. దాంతో, పరిస్థితిని అదుపు చేసేందుకు చైనా సైనికులు ప్రతి చర్యలకు దిగాల్సి వచ్చిందన్నారు. ప్యాంగాంగ్‌ సరస్సు దక్షిణ తీరంలో షెన్‌పావో పర్వత ప్రాంతంలో ఎల్‌ఏసీని భారత సైన్యం దాటి, చైనా భూభాగంలోకి వచ్చిందని ఆరోపించారు. భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ ధోవల్‌ చేశారని పేర్కొంటూ చైనా మీడియాలో వచ్చిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ ఖండించింది. ‘చైనా డైలీ, గ్లోబల్‌ టైమ్స్‌ల్లో అజిత్‌ధోవల్‌ చేశారని చెబుతూ కొన్ని వ్యాఖ్యలు ప్రచురించారు. అవి పూర్తిగా అసత్యాలు. అలాంటి ఊహాజనిత కథనాలకు దూరంగా ఉండాలని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు కాల్పుల స్థాయికి చేరడం ఆందోళనకరమని విశ్లేషకులు భావిస్తున్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని ఇరుదేశాల రక్షణ శాఖల మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, జనరల్‌ వీ ఫెంగ్‌ నిర్ణయించిన మూడు రోజులకే ఈ కాల్పుల ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఆగస్ట్‌ 29 రాత్రి ప్యాంగాంగ్‌ సరస్సు దక్షిణ భాగంలోని భారత భూభాగాన్ని చైనా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తతలు మరోసారి ప్రజ్వరిల్లాయి. ఆ తరువాత, వ్యూహాత్మకంగా కీలకమైన పలు పర్వతాలపై భారత్‌ పట్టు సాధించింది. తద్వారా ఫింగర్‌ 2, ఫింగర్‌ 3 ప్రాంతాల్లో చైనా దుశ్చర్యలను అడ్డుకునే అవకాశం లభించింది. దీన్ని చైనా తీవ్రంగా ఖండించింది. కానీ, ఆ పర్వత ప్రాంతాలు భారత భూభాగంలోనివేనని భారత్‌ స్పష్టం చేసింది. 

సాధ్యమైనంత త్వరగా శాంతి 
చైనా ఒకవైపు సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతూనే, మరోవైపు శాంతి మంత్రం జపిస్తోంది. పరస్పర సంప్రదింపుల ద్వారా అతి త్వరలోనే సరిహద్దుల్లో శాంతి నెలకొంటుందని చైనా ఆశాభావం వ్యక్తం చేసింది. చలికాలం సమీపిస్తున్న తరుణంలో, వాతావరణ పరిస్థితులు దారుణంగా మారకముందే, బలగాల ఉపసంహరణ జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. ‘సైనిక బలగాలు వివాదాస్పద ప్రదేశాల నుంచి త్వరలోనే వెనక్కు వెళ్తాయని ఆశిస్తున్నాం’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్‌  మీడియాతో వ్యాఖ్యానించారు. ‘ఆ ప్రదేశం 4వేల మీటర్ల ఎత్తున ఉంది. చలికాలంలో అక్కడ ఉండడం ప్రమాదకరం. అందువల్ల అంతకుముందే, పరస్పర సంప్రదింపులతో సాధ్యమైనంత త్వరగా బలగాల ఉపసంహరణ జరుగుతుందని ఆశిస్తున్నాం’ అన్నారు. తూర్పు లద్ధాఖ్‌లో సోమవారం భారత సైనికులే చైనా బలగాలపై మొదట కాల్పులు జరిపాయని ఆయన ఆరోపించారు.  

45 ఏళ్లుగా నో ఫైర్‌ జోన్‌
భారత్, చైనా సరిహద్దుల మధ్య సరిగ్గా 45 ఏళ్ల తర్వాత మళ్లీ తూటా పేలింది. ఇరుపక్షాల మధ్య ఒప్పందాల్ని తోసిరాజని చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) తుపాకీ చేతపట్టి కాల్పులకు తెగబడింది. నేరుగా సైనికులపైకి గురి పెట్టకపోయినప్పటికీ 1975 తర్వాత వాస్తవాధీన రేఖ వెంబడి తుపాకీల మోత వినబడడం ఇదే తొలిసారి. 1962 చైనా యుద్ధంలో భారత్‌ ఓటమిపాలయ్యాక ఆ దేశం అక్సాయిచిన్‌ను ఆక్రమించుకుంది. ఆ తర్వాత 1967లో మళ్లీ భారత్‌లో సిక్కింపై దురాక్రమణకు దిగింది. కానీ అప్పుడు మన సైన్యం చైనాకు గట్టి బుద్ధి చెప్పింది. ఇరువైపుల హోరాహోరి పోరు సాగింది. మన దేశ జవాన్లు 80 మంది అమరులైతే చైనా వైపు 400 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత 1975లో అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దుల్లో తులుంగ్‌ లా సమీపంలో అస్సాం రైఫిల్స్‌పై చైనా పీఎల్‌ఏ సైనికులు కాల్పులకు తెగబడ్డారు.

ఈ కాల్పుల్లో భారత్‌కు చెందిన జవాన్లు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత వాస్తవాధీన రేఖ వెంబడి చిన్నా చితకా ఘటనలు జరిగినప్పటికీ తుపాకీల మోత ఆ తర్వాత మోగలేదు. 1975–90 మధ్య రెండు దేశాలు ఉద్రిక్తతలు రేగినప్పుడల్లా పరిస్థితుల్ని అదుపులోకి తెస్తూ ఉండేవి. 1988లో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ చైనా పర్యటనకు వెళ్లినప్పుడు 3,500 కి.మీ పొడవునా ఉన్న సరిహద్దుల్లో శాంతి స్థాపన కోసం పరస్పరం విశ్వాసం పాదుకొల్పే చర్యలుకు తొలుత శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత 1993, 1996, 2005, 2012, 2013లో పలు ఒప్పందాలు జరిగాయి. 1996లో జరిగిన ఒప్పందంలో ఆర్టికల్‌ 6 ప్రకారం ఇరుపక్షాలు వాస్తవాధీన రేఖ వెంబడి 2 కి.మీ. వరకు కాల్పులు, పేలుళ్లకు పాల్పడకూడదు. స్వీయనియంత్రణ పాటిస్తూ సమస్యను శాంతి యుతంగా చర్చించుకోవాలి. కానీ గత నాలుగైదు నెలులుగా సరిహద్దుల్లో డ్రాగన్‌ దేశం దుందుడుకు చర్యలు మితిమీరిపోతున్నాయి. 

అసలేం జరిగింది..? 
‘తూర్పు లద్దాఖ్‌లోని రెజాంగ్‌ లా పర్వత శిఖర మార్గంలోని ముఖ్‌పారి వద్ద ఉన్న భారత ఫార్వర్డ్‌ పోస్ట్‌ను సోమవారం రాత్రి చైనా దళాలు చుట్టుముట్టేందుకు ప్రయత్నించాయి. వారి వద్ద తుపాకులతో పాటు, రాడ్‌లు, మేకులు అమర్చిన దుడ్డుకర్రలు, బల్లెం తరహా పదునైన ఆయుధాలున్నాయి. వారు సుమారు 50–60 మంది వరకు ఉన్నారు. వారిని భారత దళాలు గట్టిగా ప్రతిఘటించాయి. దాంతో, అక్కడ తీవ్ర స్థాయిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చివరకు, చైనా సైనికులను వెనక్కు పంపించేందుకు భారత దళాలు గట్టిగా ప్రయత్నిస్తున్న సమయంలో.. భారత సైనికులను భయపెట్టేందుకు చైనా సైనికులు తుపాకులతో గాలిలో 15 –20 రౌండ్ల పాటు కాల్పులు జరిపారు’ అని భారత ప్రభుత్వ వర్గాలు వివరించాయి. భారత దళాలు ఎలాంటి కాల్పులకు పాల్పడలేదని స్పష్టం చేశాయి. వ్యూహాత్మకంగా కీలకమైన రెజాంగ్‌ లా, ముఖ్‌పరి ప్రాంతాల నుంచి భారత బలగాలను వెనక్కు పంపడం లక్ష్యంగా చైనా ఈ చర్యలకు పాల్పడుతోందని పేర్కొన్నాయి. చైనా సరిహద్దుల్లో కాల్పుల ఘటన చోటు చేసుకోవడం 45 ఏళ్ల తరువాత ఇదే ప్రథమం.

మరిన్ని వార్తలు