లద్దాఖ్‌ దగ్గరలో చైనా కొత్త ఎయిర్‌బేస్‌

20 Jul, 2021 06:24 IST|Sakshi

న్యూఢిల్లీ: సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు పూర్తిగా చల్లారకముందే చైనా మరో దుశ్చర్యకు దిగుతోంది. లద్దాఖ్‌లోని షాక్చే వద్ద చైనా నూతనంగా ఎయిర్‌బేస్‌ను అభివృద్ది చేస్తున్న విషయాన్ని భారతీయ ఏజెన్సీలు గమనించాయి. ఇది పూర్తయితే లైన్‌ఆఫ్‌ కంట్రోల్‌ పొడుగునా చైనాకు వైమానిక మద్దతు పెరగనుంది. షాక్చేలోని ఎయిర్‌బేస్‌ను పూర్తిస్థాయి మిలటరీ బేస్‌గా చైనా రూపుదిద్దుతోందని, ఫైటర్‌ ఆపరేషన్స్‌కు అనుకూలంగా దీన్ని మారుస్తోందని భారతీయ అధికారి ఒకరు చెప్పారు.

ఎల్‌ఓసీ వద్ద గతేడాదిగా నెలకొన్న ఉద్రిక్తతలను ఈ చర్య మరింత ఎగదోస్తుందన్న ఆందోళనను వ్యక్తం చేశారు. యుద్దమే వస్తే తమ కన్నా వేగంగా భారతీయ వైమానిక దళం ఎల్‌ఓసీ వద్దకు చేరుకుంటుందని చైనా ఎప్పుడో గమనించింది. ఇందుకు సమాధానంగానే షాక్చే వద్ద మిలటరీ ఎయిర్‌బేస్‌ను అభివృద్ధి చేస్తోందని నిపుణులు భావిస్తున్నారు. ఖష్గర్, హోగాన్‌ మధ్యలో ఒక కొత్త బేస్‌ను కూడా చైనా నిర్మిస్తోంది. గతేడాది నుంచి సరిహద్దుకు దగ్గరలోని 7 చైనా ఎయిర్‌బేస్‌లపై భారతీయ ఏజెన్సీలు కన్నేసి ఉంచాయి. ఇటీవల కాలంలో ఈ బేస్‌లను మరింతగా బలోపేతం చేస్తున్నట్లు గమనించాయి.

మరిన్ని వార్తలు