చైనా దుస్సాహసం.. భారత్‌లో గ్రామం

18 Jan, 2021 17:59 IST|Sakshi

అరుణాచల్‌ ప్రదేశ్‌ ఎగువ సుబన్సిరిలో 101 ఇళ్లతో గ్రామం ఏర్పాటు చేసిన డ్రాగన్‌

న్యూఢిల్లీ: సరిహద్దులో చైనా ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా డ్రాగన్‌ మరో దుస్సాహసానికి దిగింది. అరుణాచల్‌ ప్రదేశ్ వెంబడి భారత భూభాగంలోకి 4.5కిలోమీటర్ల మేర చొచ్చుకురావడమే కాక అక్కడ ఏకంగా ఓ గ్రామాన్ని నిర్మించింది. దాదాపు 101 ఇళ్లు ఉన్న ఈ గ్రామం శాటిలైట్‌ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరలవుతున్నాయి. అయితే గతేడాది నవంబర్‌లోనే చైనా డోక్లాం ఘర్షణ స్థావరానికి అతి సమీపంలో ఓ గ్రామాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసింది. తాజాగా వాస్తవ సరిహద్దుకు కేవలం 4.5కిలోమీటర్ల దూరంలోనే మరో గ్రామాన్ని ఏర్పాటు చేయడం ఆందోళన కలిగిస్తోంది. అయితే దీని గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇక తాజాగా చైనా నిర్మించిన గ్రామం భారత్‌-చైనాల మధ్య వివాదాస్పదంగా ఉన్న ఎగువ సుబన్సిరి జిల్లా సారి చు నది ఒడ్డున ఏర్పడింది. ఇక్కడ ఎల్లప్పుడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయి. (చదవండి: ఆగని డ్రాగన్‌ ఆగడాలు)

ఇక ప్రస్తుతం చైనా గ్రామాన్ని ఏర్పాటు చేసిన ప్రాంతానికి సంబంధించి 2019, ఆగస్టు నాటి శాటిలైట్‌ ఫోటోల్లో అక్కడ ఎలాంటి నిర్మాణాలు లేకపోగా.. 2020, నవంబర్‌ నాటి చిత్రాల్లో​ వరుసగా ఉన్న ఇళ్లు దర్శనమిచ్చాయి. అంటే ఏడాది వ్యవధిలోనే చైనా ఇక్కడ గ్రామాన్ని ఏర్పాటు చేసినట్లు ఈ ఫోటోలని బట్టి తెలుస్తోంది. ఇందుకు సంబంధించి విదేశాంగ మంత్రిత్వ శాఖను సంప్రదించగా.. సరిగా స్పందించలేదని తెలిసింది. ‘‘సరిహద్దు ప్రాంతాల్లో చైనా చేపట్టిన నిర్మాణ పనులను ఇండియా జాగ్రత్తగా గమనిస్తోంది. గతకొన్నేళ్లుగా చైనా సరిహద్దు ప్రాంతంలో మౌలిక సదుపాయాల నిర్మాణాలు చేపడుతోంది’’ అని తెలిపినట్లు సమాచారం. (చదవండి: మా ఓపికను పరీక్షించొద్దు!)

గతంలోనే హెచ్చరించిన బీజేపీ ఎంపీ
ఇక అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా చేపట్టిని నిర్మణాల గురించి గతేడాది నవంబర్‌లోనే ఆ రాష్ట్ర బీజేపీ ఎంపీ తపిర్‌ గావో ప్రస్తావించారు. లోక్‌సభలో చైనా చొరబాట్ల గురించి, ప్రత్యేకంగా ఎగువ సుబున్సిరి జిల్లా గురించి హెచ్చరించారు. ఇక తాజాగా దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. చైనా ఎగువ సుబన్సిరి జిల్లాలో నది వెంబడి 60-70 కిలోమీటర్లు లోనికి ప్రవేశించింది. ఇక్కడ ఓ డబుల్‌ లేన్‌ రోడ్డు నిర్మాణం కూడా చేపడుతోంది’ అన్నారు. ఇక గతేడాది గల్వాన్‌ ఘర్షణ అనంతరం సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. యథాతథ స్థితిని పునరుద్ధరించడానికి ఇరు దేశాల మధ్య చర్చలు నడుస్తోన్న సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు