China Vs India: సరిహద్దులో చైనా దూకుడు!

28 Sep, 2021 05:11 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తూర్పు లద్దాఖ్‌ వెంట అదనపు సైనికుల కోసం కొత్త శిబిరాల ఏర్పాటు

న్యూఢిల్లీ: భారత్‌తో సరిహద్దు వెంట చైనా పెద్ద ఎత్తున సైనికులను మోహరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సైనికుల కోసం కొత్తగా శిబిరాలను ఏర్పాటుచేస్తోంది. తూర్పు లద్దాఖ్‌లో సముద్ర మట్టానికి అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లో కంటైనర్‌ ఆధారిత స్థావరాలను నిర్మిస్తోంది. తషిగాంగ్, మాంజా, హాట్‌ స్ప్రింగ్స్, చురుప్‌సహా మరి కొన్ని ప్రాంతాల్లో వీటిని సిద్ధంచేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

సైనిక మోహరింపుతోపాటు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దు వెంట గతంలో ఎన్నడూ తాము వినియోగించని భూభాగాల్లోనూ సైన్యాన్ని మోహరించాలని యోచిస్తోంది. గల్వాన్‌ ఘర్షణల తర్వాత మరిన్ని ‘ఫార్వర్డ్‌’ ప్రాంతాల్లో తమ సైన్యాన్ని మోహరించనుంది. ‘ గతంలో దిష్టవేయని సముద్ర మట్టానికి అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లో  ఉండటమనేది చైనా సైనికులకు కష్టమైన పని. చైనా సేనలకు  కొత్త కష్టం వచ్చి పడింది’ అని భారత సైన్యానికి సంబంధించిన ఒక అధికారి వ్యాఖ్యానించారు. భారత్‌ సైతం చైనాకు ధీటుగా స్పందిస్తోంది. 

>
మరిన్ని వార్తలు