చైనా పన్నాగం; ఆ తర్వాతే బలగాల ఉపసంహరణ!

17 Oct, 2020 16:00 IST|Sakshi

న్యూఢిల్లీ: గల్వాన్‌ లోయలో ఘర్షణ తర్వాత భారత్‌- చైనా దేశాలు వాస్తవాధీన రేఖ వెంబడి భారీ స్థాయిలో యుద్ధ ట్యాంకులను మోహరించాయి. కౌంటర్‌ అటాక్‌ కోసం మిసైళ్ల మోహరింపు సహా ఇతర యుద్ధ సామాగ్రిని బార్డర్‌కు తరలించాయి. అయితే ఇవి కేవలం ముందు జాగ్రత్త చర్యలు మాత్రమేనని, చర్చల ద్వారానే ఉద్రిక్తతలకు స్వస్తి పలకాలన్నదే తమ ఉద్దేశమని, ఇరు దేశాల మధ్య జరుగుతున్న మిలిటరీ స్థాయి చర్చలు సుస్పష్టం చేస్తున్నాయి. కానీ మూడేళ్ల క్రితం డోక్లాం వివాదంలో, ఇటీవలి జూన్‌ 15 నాటి ఘటన తర్వాత డ్రాగన్‌ ఆర్మీ ఎంతటి ఘాతుకానికి పాల్పడేందుకైనా వెనకాడబోదన్న విషయం, చైనా సైన్యం కుయుక్తులు మరోసారి బట్టబయలయ్యాయి. ఇలాంటి తరుణంలో బలగాల ఉపసంహరణ విషయంలోనూ డ్రాగన్‌ అనుసరిస్తున్న వైఖరిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.(చదవండి: రణరంగంలో డ్రోన్‌లదే ప్రాధాన్యత)

చైనా కుయుక్తులు
తూర్పు లదాఖ్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నాటి నుంచి ఇప్పటికే పలు దఫాలుగా ఈ విషయం గురించి ఇరు వర్గాల మిలిటరీ అధికారుల మధ్య చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు విభేదాలను పరిష్కరించుకునే అంశం మీద దృష్టి పెట్టిన వేళ చైనా, అనేకమార్లు దుందుడుకుగా వ్యవహరించింది. ఎల్‌ఏసీ వెంబడి 5జీ నెట్‌వర్క్‌ ఏర్పాటు ప్రయత్నాలతో పాటుగా ప్యాంగ్‌యాంగ్‌ సరస్సు వద్ద కొత్తగా నిర్మాణాలు చేపట్టడం సహా, డోక్లాం, నకు లా, సిక్కిం సెక్టార్ల వద్ద డ్రాగన్‌ కొత్తగా రెండు ఎయిర్‌ డిఫెన్స్‌ స్థావరాలు నిర్మిచండం వంటి కవ్వింపు చర్యలకు దిగింది. డోక్లాం పీఠభూమిలో భారత్‌- చైనా-భూటాన్‌ ట్రై జంక్షన్‌లో ఆర్మీ కార్యకలాపాలకు డ్రాగన్‌ చేపట్టిన కొత్త నిర్మాణాల ఫొటోలు కూడా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల నుంచి బలగాలను వెనక్కి పిలవడమే లక్ష్యంగా జరుగుతున్న చర్చల్లో చైనా మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించినట్లు తెలుస్తోంది. (అణ్వాయుధాలను రెట్టింపు చేసుకునే పనిలో చైనా!?)

యథాతథస్థితి నెలకొన్న తర్వాతే
తొలుత యుద్ధ ట్యాంకులు, ఇతర సామాగ్రిని బార్డర్‌ నుంచి ఉపసంహరించుకున్న తర్వాతే, ఉద్రిక్తతలు తగ్గుతాయని, అప్పుడే బలగాల ఉపసంహరణ ప్రక్రియ కూడా సాఫీగా సాగిపోతుందనే వాదనను డ్రాగన్‌ లేవలెత్తినట్లు సమాచారం. అయితే చైనా కుయుక్తులను పసిగట్టిన భారత్‌, పలు దశల్లో బలగాలను వెనక్కి పిలిచి, వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే ఉద్రిక్తతలు చల్లారే అవకాశం ఉందని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అంతేగాక, లదాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి 1597 కిలోమీటర్ల మేర ఏప్రిల్‌ 2020 ముందునాటి యథాతథస్థితి నెలకొన్న తర్వాతే ఇది సాధ్యమవుతుందని తేల్చిచెప్పినట్లు సమాచారం. మిలిటరీ స్థాయి చర్చల్లో ఈ మేరకు ఇరువర్గాల నుంచి ప్రతిపాదనలు వచ్చినట్లు జాతీయ మీడియా వెల్లడించింది.(యుద్ధానికి సిద్ధంగా ఉండండి: జిన్‌పింగ్‌) 

ఒకవేళ తోక జాడిస్తే
ఈ నేపథ్యంలో... యుద్ధ ట్యాంకులు, ఫిరంగి దళాలను వెనక్కి పిలవడం భారత్‌కు ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని మిలిటరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ పీఎల్‌ఏ మళ్లీ తోకజాడిస్తే, యుద్ధ సామాగ్రిని అంతత్వరగా బార్డర్‌కు తరలించలేమని, అదే సమయంలో ఇప్పటికే సరిహద్దుల్లో భారీస్థాయిలో రహదారులు, వంతెనల నిర్మాణాలు చేపట్టినందున డ్రాగన్‌కు వేగంగా కదిలి మరోసారి విషం చిమ్మే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ప్యాంగ్యాంగ్‌, హాట్‌స్ప్రింగ్స్‌లో చైనా ఆర్మీ గతంలో ప్రదర్శించిన దుందుడుకు వైఖరిని దృష్టిలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఇక బలగాల ఉపసంహరణ విషయంలో చైనా జాప్యానికి గల కారణాలపై జాతీయ భద్రతా నిపుణులు మరో వాదనను తెరపైకి తీసుకువస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలతో ఈ అంశాన్ని ముడిపెడుతున్నారు.(భారత సరిహద్దులో 60 వేల చైనా సైన్యం: అమెరికా) 

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం ఉంటుందా?
ఈ క్రమంలో, నవంబరు 3న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసేంత వరకు డ్రాగన్‌ చర్చల సాగదీతతకే ప్రాధాన్యం ఇస్తుందని, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు అనుకూల ఫలితాలు వెలువడే అవకాశం ఉంటే ఒకలా, వ్యతిరేక పవనాలు వీస్తే చైనా ఆర్మీ వైఖరి మరోలా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం చైనా, తైవాన్‌పై ఎక్కువగా దృష్టి సారించిందని, అధ్యక్ష ఎన్నికల ఫలితం తర్వాత భారత సరిహద్దుల్లో అనుసరించే వైఖరిపై ఓ స్పష్టత వస్తుందని చెబుతున్నారు. కాగా తమ అంతర్భాగమని చైనా చెప్పుకొంటున్న తైవాన్‌కు అమెరికా అన్ని విధాలుగా అండగా ఉంటున్న సంగతి తెలిసిందే.

వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే!
అయితే మరో వర్గం మాత్రం ఈ వాదనలను కొట్టిపారేస్తోంది. వుహాన్‌లో ఉద్భవించిన కరోనా వైరస్‌ ప్రభావం, ఆర్థిక వ్యవస్థ పతనం, రాజకీయపరంగా వస్తున్న విమర్శలు తదితర అంతర్గత అంశాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే జిన్‌పింగ్‌ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ సమస్యలన్నీ ఒక కొలిక్కి వచ్చేదాకా వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగుతునాయని పేర్కొంటున్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డ్రాగన్ ఇలా చేస్తోందని విమర్శిస్తున్నారు.

మరిన్ని వార్తలు