మారని డ్రాగన్‌ తీరు.. 5జీ నెట్‌వర్క్‌, సరికొత్త నిర్మాణాలు!

28 Aug, 2020 14:34 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌- చైనా సరిహద్దుల్లో నెలకొన్న వివాదాలకు పరిష్కారం దిశగా చర్చలు కొనసాగుతున్న సమయంలో వాస్తవాధీన రేఖ వెంబడి డ్రాగన్‌ మరోసారి సరికొత్త నిర్మాణాలు చేపట్టింది. జూన్‌ నెలలో చెలరేగిన ఘర్షణలకు కేంద్ర బిందువైన తూర్పు లదాఖ్‌ సమీపంలో డెమ్‌చోక్‌ వద్ద చైనా 5జీ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. వాస్తవాధీన రేఖ వెంబడి మెరుగైన కమ్యూనికేషన్‌ కోసం ఆగష్టు తొలి వారం నుంచే ఈ మేరకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు వెల్లడించాయి. అదే విధంగా ప్యాంగ్‌యాంగ్‌ సరస్సు వద్ద కొత్తగా గుడారాలు, షెడ్లు నిర్మించినట్లు పేర్కొన్నాయి. ఓవైపు.. సమస్యాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణకై చర్చలు జరుగుతున్న వేళ చైనా ఇలాంటి నిర్మాణాలు చేపట్టడం గమనార్హం. దీంతో మరోసారి సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. (చదవండి: విమాన విధ్వంస క్షిపణులను ప్రయోగించిన చైనా)

ఇదిలా ఉండగా.. వాస్తవాధీన రేఖ నుంచి వెనక్కి వెళ్లడంలో చైనీస్‌ బలగాలు జాప్యం చేస్తున్నందున భారత్‌ కూడా లదాఖ్‌లో మరిన్ని బలగాలు మోహరించినట్లు సమాచారం. ఇప్పటికే మూడు రెట్ల మేర ఎక్కువ బలగాలను అక్కడికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి ఓ ఆర్మీ అధికారి మాట్లాడుతూ.. ‘‘అనేక సమీక్షలు నిర్వహించిన అనంతరం బలగాల మోహరింపుపై నిర్ణయం తీసుకుంటారు. పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేనందున సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాలను మరింతగా పెంచుకోవడం జరుగుతుంది’’ అని పేర్కొన్నారు.(చదవండి: 45 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే ప్రాణనష్టం)

మారని డ్రాగన్‌ తీరు
బలగాల ఉపసంహరణకై చర్చలు జరుగుతున్నప్పటికీ చైనా వైఖరిలో ఎలాంటి మార్పు కనపడటం లేదు. ప్యాంగ్‌యాంగ్‌ సరస్సు వెంబడి డ్రాగన్‌ బలగాలు తమ ఉనికి చాటుకుంటూనే ఉన్నాయి. కేవలం ఫింగర్‌ 4, ఫింగర్‌ 5 వద్ద మాత్రమే కాస్త వెనక్కి జరిగినట్లు సమాచారం. దీంతో ప్రత్యర్థికి కౌంటర్‌ ఇచ్చేందుకు భారత్‌ సైతం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు పోటాపోటీగా నిర్ణయం తీసుకోవడం సరిహద్దుల వద్ద పరిస్థితులు మరింత సంక్లిష్టతరంగా మారే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే విధంగా.. ఫింగర్‌ 4 ఏరియా నుంచి భారత్‌ బలగాలను వెనక్కి రప్పించినప్పటికీ.. అటువైపు నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఏప్రిల్‌ నాటికి ఉన్న యథాతథ స్థితిని కొనసాగించేందుకే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. 

మరోవైపు.. చైనా మాత్రం ఫింగర్‌ 5,8 ఏరియాల్లో తన బలాన్ని మరింత పెంచుకున్నట్లు సమాచారం. శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో పడవలు తరలించి, గుడారాలు నిర్మించడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. ‘‘ప్యాంగ్‌యాంగ్‌ సరస్సు నుంచి వెనక్కి వెళ్లాలంటే భారత్‌ కూడా తన బలగాలను ఉపసంహరించాలని చైనా డిమాండ్‌ చేస్తోంది. అలా అయితే మా నియంత్రణలో ఉన్న ప్రాంతంపై పట్టు కోల్పోయినట్లు అవుతుంది. యథాస్థితి మార్పునకు ఇది దారి తీస్తుంది. చైనా డిమాండ్లతో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారాయి’’అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి సరిహద్దు పరిస్థితుల గురించి జాతీయ మీడియాకు వివరించారు. (చదవండి: గ‌ల్వాన్ ఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌రం: చైనా రాయ‌బారి)

సైనిక చర్యకు వెనుకాడబోము
జూన్‌లో గల్వాన్‌ లోయలో చైనా ఆర్మీ ఘాతుకానికి కల్నల్‌ సంతోష్‌ బాబు సహా 20 మంది భారత జవాన్లు అమరులైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను రూపుమాపేందుకు ఇప్పటికే పలు దఫాలుగా దౌత్య, మిలిటరీ చర్చలు జరిగాయి. ఇందులో భాగంగా బలగాల ఉపసంహరణ విషయంలో ఇప్పటికే ఐదుసార్లు కార్‌‍్ప్స కమాండర్‌ స్థాయి చర్చలు జరుగగా.. త్వరలోనే మరోమారు మిలిటరీ అధికారుల సమావేశం జరిగే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 

అదే విధంగా ఘర్షణకు మూల కారణమైన గల్వాన్‌, పెట్రోల్‌ పాయింట్‌ 15, ప్యాంగ్‌యాంగ్‌ నుంచి ఇరు వర్గాలు బలగాల ఉపసంహరణకు అంగీకరించినప్పటికీ.. గోగ్రా హాట్‌ స్ప్రింగ్స్‌ ఏరియా(పెట్రోల్‌ పాయింట్‌ 17ఏ) వద్ద మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఈ నేపథ్యంలో చైనా తీరు మారనట్లయితే సైనిక చర్యకు సైతం వెనుకాడేది లేదని చీఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ఇటీవలే డ్రాగన్‌ను ఉద్దేశించి ఘాటు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.    

మరిన్ని వార్తలు