మారని చైనా తీరు.. మరోసారి కవ్వింపు చర్యలు

31 Aug, 2020 11:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగిన చైనా ఆర్మీకి భారత సైన్యం దీటుగా సమాధానమిచ్చింది. తూర్పు లదాఖ్‌, ప్యాంగ్‌యాంగ్ త్సో‌ సరస్సు ప్రాంతాల్లో యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నించిన డ్రాగన్‌ సైనికుల కుయుక్తులను తిప్పికొట్టింది. బలగాల ఉపసంహరణ చర్చల ఒప్పందాన్ని ఉల్లంఘించిన ప్రత్యర్థి దేశానికి గట్టిగా బుద్ధి చెప్పింది. ఈ నేపథ్యంలో దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూనే చర్చల ద్వారా సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు ముగింపు పలికే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేసింది. ఉద్రిక్తతలను తగ్గించే క్రమంలో చుషుల్‌ వద్ద బ్రిగేడ్‌ కమాండర్‌ స్థాయిలో ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలిపింది.(చదవండి: డోక్లాం సమీపంలో చైనా మిసైల్‌ బేస్‌ల నిర్మాణం)

కాగా గల్వాన్‌ లోయలో జూన్‌ 15న ఘాతుకానికి పాల్పడిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ 20 మంది భారత సైనికులను పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పలు దఫాలుగా దౌత్యపరమైన, మిలిటరీ చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకునేందుకు ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు ప్రకటనలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో దశల వారీగా బలగాలను రప్పించాలనే ఒప్పందానికి తూట్లు పొడిచిన చైనా ఆర్మీ ఆగష్టు 29, 30 తేదీల్లో తూర్పు లదాఖ్‌, ప్యాంగ్‌ యాంగ్‌ సరస్సు వద్ద స్టేటస్‌ కోను మార్చే ప్రయత్నాలు చేసిందని భారత రక్షణ శాఖ వెల్లడించింది. (చదవండి: డ్రాగన్‌ దూకుడుకు చెక్‌)

మరిన్ని వార్తలు