కుటుంబానికొక్కరు సైన్యంలోకి

31 Jul, 2021 04:05 IST|Sakshi

టిబెట్‌లో చైనా నిర్బంధ ఎంపికలు

భారత్‌కు దీటుగా ఎల్‌ఏసీ వెంట మోహరించేందుకే

న్యూఢిల్లీ: భారత్‌కు దీటుగా సరిహద్దుల్లో బలాన్ని పెంచుకునేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని డ్రాగన్‌ దేశం చైనా వినియోగించుకుంటోంది. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్‌ఏసీ) వెంట మోహరించడమే లక్ష్యంగా టిబెట్‌ యువతను సైన్యంలోకి తీసుకుంటోంది. టిబెట్‌లోని ప్రతి కుటుంబం నుంచి ఒక్కరు చొప్పున సైన్యంలో చేరాల్సిందేనని పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ, చైనా సైన్యం) ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఈ ఏడాది జనవరి–ఫిబ్రవరి నుంచి టిబెట్‌లోని యువతకు పీఎల్‌ఏ వివిధ విధేయత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తమకు సమాచారం ఉందని భారత నిఘావర్గాలు తెలిపాయి. వారికి మాండరిన్‌ బోధించడం, మిగతా అన్నిటి కంటే చైనా కమ్యూనిస్టు పార్టీయే మిన్న అని వారిలో నూరిపోయడం వంటివి చేపట్టిందని పేర్కొన్నాయి. ఎంపికైన వారికి కొండ ప్రాంతాల్లో, కఠిన శీతల పరిస్థితుల్లో విధి నిర్వహణపై శిక్షణ అందిస్తోందని వెల్లడించాయి. టిబెటన్లను సైన్యంలోకి తీసుకోవడం ద్వారా అనేక అనుకూలతలను సాధించాలని చైనా భావిస్తోంది.

మొదటగా, చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం, పీఎల్‌ఏ పట్ల యువతలో విధేయతను సాధించడం, టిబెట్‌ అటానమస్‌ రీజియన్‌లోని ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించడం. రెండోది..లద్దాఖ్‌ వంటి కఠిన పరిస్థితులుండే ప్రాంతంలో పీఎల్‌ఏకు భద్రత విధుల భారం తగ్గించడం. మూడోది, ముఖ్యమైంది.. కఠిన పరిస్థితులుండే లద్దాఖ్, హిమాచల్‌ప్రదేశ్‌లోని ఎల్‌ఏసీ వెంట భారత్‌లోని ప్రవాస టిబెటన్లు విధులను సమర్థవంతంగా నిర్వహిస్తుండటంతో వారికి దీటుగా టిబెటన్లను అంతే స్థాయిలో ఎల్‌ఏసీ వెంట శాశ్వత ప్రాతిపదికన రంగంలోకి దించడం అని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. గత ఏడాది పాంగాంగో సో సరస్సు దక్షిణం వైపు ఎల్‌ఏసీ వెంట పీఎల్‌ఏ చొచ్చుకు వచ్చే అవకాశాలున్నాయని అనుమానించిన భారత్‌ టిటెటన్లతో కూడిన స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌ను మొఖపరి, బ్లాక్‌ టాప్, ఇతర కొండ ప్రాంతాల్లో ఆక్రమించి చైనాకు షాకిచ్చింది. అప్పటి ఈ పరిణామమే చైనాను టిబెటన్‌ యువత వైపు మొగ్గేలా చేసిందని భావిస్తున్నారు.

నేడు భారత్‌–చైనా 12వ రౌండ్‌ చర్చలు
సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించే లక్ష్యంతో దాదాపు మూడున్నర నెలల తర్వాత ఈనెల 31వ తేదీన భారత్, చైనాల సైనికాధికారులు చర్చలు జరపనున్నారు. తూర్పు లద్దాఖ్‌లోని కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా హాట్‌ స్ప్రింగ్స్, గోగ్రాల నుంచి సైనికబలగాల ఉపసంహరణలో కొంత పురోగతి సాధించడంపై రెండు వర్గాలు దృష్టి పెడతాయని సైనిక వర్గాలు తెలిపాయి. శనివారం ఉదయం 10.30 గంటలకు తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్‌ఏసీ) వెంట చైనా భూభాగంలోని మోల్దో బోర్డర్‌ పాయింట్‌లో కార్ప్స్‌ కమాండర్‌ స్థాయి చర్చలు మొదలు కానున్నాయి. రెండు దేశాల సైనికాధికారుల మధ్య భారత్‌ భూభాగంలోని చుషుల్‌ వద్ద ఏప్రిల్‌ 9వ తేదీన 11వ విడత చర్చలు జరిగాయి. 11వ విడత చర్చల తర్వాత ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై చైనా సానుకూలంగా లేకపో వడంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. గత ఏడాది మే నెల నుంచి తూర్పు లద్దాఖ్‌లో రెండు దేశాలు పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించిన విషయం తెలిసిందే.  

మరిన్ని వార్తలు