అక్కడ బలగాల ఉపసంహరణకు చైనా నిరాకరణ

23 Jul, 2020 17:24 IST|Sakshi

న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసి) వెంట బలగాల ఉపసంహరణకు భారత్‌-చైనా ఇరు దేశాలు అంగీకరించిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా ఈ అంశంపై చైనా మాటమారుస్తోంది. ఈ క్రమంలో ఎంతో ముఖ్యమైన పాంగాంగ్ త్సో సరస్సు ప్రాంతం, గోగ్రా పోస్ట్ నుంచి బలగాల ఉపసంహరణకు చైనా నిరాకరిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు కీలకమైన పాయింట్ల నుంచి ఇంతవరకు ఎలాంటి ఉపసంహరణ జరగలేదని విశ్వసనీయ సమాచారం. పాంగాంగ్‌త్సో ప్రాంతంలో పూర్తిగా ప్రతిష్టంభన ఏర్పడగా.. గోగ్రా పోస్ట్‌ ప్రాంతంలో ఉపసంహరణ తాజాగా నిలిచిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో సమస్య మళ్లీ మొదటికొచ్చేలా ఉందంటున్నారు అధికారులు. ఇదిలా ఉండగా చైనా కీలకంగా భావించిన హాట్‌స్ర్పింగ్‌ ప్రాంతం నుంచి బలగాల ఉపసంహరణ ఈ రోజు మొదలైనట్లు తెలుస్తోంది. నిన్నటి వరకు ఈ ప్రాంతంలో చైనా అదనంగా 40 వేల మంది సైనికులను మోహరించినట్లు వార్తలు వచ్చాయి.  (వెనక్కి తగ్గిన చైనా)

భారత్-చైనా సైనిక కమాండర్ల మధ్య ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగాయి. జూన్ 15న లద్దాఖ్‌ గల్వాన్ లోయలో బలగాల ఉపసంహరణ సమయంలో చైనా కుట్రపూరితంగా వ్యవహరించి కల్నల్ సంతోష్ బాబుతో పాటు 20 మంది భారత జవాన్లను పొట్టనపెట్టుకుంది. దాంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. వీటిని తగ్గించుకునేందుకు ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. అనంతరం కొన్ని పాయింట్ల నుంచి బలగాల ఉపసంహరణ జరిగింది. (చైనాపై ‘విసర్జికల్‌ స్ట్రైక్‌’)

మరిన్ని వార్తలు