బలగాల మోహరింపు.. ఒప్పందానికి చైనా తూట్లు

25 Jan, 2021 02:27 IST|Sakshi

న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో ఉన్న ఘర్షణాత్మక ప్రాంతాలకు కొత్తగా బలగాలను తరలించరాదన్న ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించింది. సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖకు చైనా వైపున్న మిలటరీ పాయింట్స్‌లో బలగాల సంఖ్యను పెంచింది. ఉద్రిక్తతలను తొలగించే ఉద్దేశంతో గతంలో రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ చైనా ఈ చర్యలకు పాల్పడింది. వ్యూహాత్మకంగా కీలకమైన ఘర్షణాత్మక ప్రదేశాలకు కొత్తగా బలగాలను పంపించరాదని గతేడాది సెప్టెంబర్‌ 21న జరిగిన 6వ విడత చర్చల సమయంలో చైనానే ప్రతిపాదించడం గమనార్హం. తమ ప్రతిపాదనపై కుదిరిన ఒప్పందాన్నే చైనా ఉల్లంఘించిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్‌ నెలాఖరు నుంచే బలగాల మోహరింపు కార్యక్రమాన్ని చైనా చేపట్టిందని వెల్లడించాయి. చైనా చర్యలను గమనించిన భారత్‌.. ముందు జాగ్రత్తగా పలు కీలక ప్రాంతాల్లో బలగాలను మోహరించింది. దాంతో, ఇరుదేశాల సాయుధ దళాలు, యుద్ధ ట్యాంకులు మరింత దగ్గరగా మోహరించిన పరిస్థితి మరోసారి నెలకొంది.   
  
చైనాతో 9వ విడత చర్చలు
భారత్, చైనాల మధ్య ఆర్మీ కమాండర్‌ స్థాయిలో మరో విడత చర్చలు ఆదివారం జరిగా యి. దాదాపు రెండున్నర నెలల తరువాత జరిగిన 9వ విడత చర్చలు ఇవి. నవంబర్‌ 6న ఇరు దేశాల మధ్య 8వ విడత చర్చలు జరిగాయి. తూర్పు లద్దాఖ్‌లోని అన్ని వివాదాస్పద కేంద్రాల నుంచి బలగాల ఉపసంహరణ కొనసాగాలన్న అంశంపై 9వ విడత చర్చలు జరిగాయి. తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖకు ఆవలివైపు(చైనా వైపు) మోల్దో సరిహద్దు పాయింట్‌ వద్ద ఉదయం 10 గంటలకు ఈ చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ చర్చల్లో భారత ప్రతినిధి బృందానికి 14 కార్ప్స్‌ కమాండర్‌ లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ పీజీకే మెనన్‌ నాయకత్వం వహించారు. ప్రస్తుతం తూర్పు లద్దాఖ్‌లోని పలు వ్యూహాత్మక పర్వత ప్రాంతాల్లో సుమారు 50 వేల మంది భారత సైనికులు మోహరించి ఉన్నారు. చైనా కూడా దాదాపు అంతే సంఖ్యలో సైనికులను సిద్ధంగా ఉంచింది. మరిన్ని దళాలను పంపించకూడదని, యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చేందుకు ప్రయత్నించ కూడదని, 6వ విడత చర్చల సందర్భంగా ఇరుదేశాలు అంగీకరించిన విషయం తెలిసిందే.  

మరిన్ని వార్తలు