డ్రాగన్‌ దొంగదెబ్బ : భారత్‌పై మరో కుట్ర

14 Sep, 2020 10:21 IST|Sakshi

చైనా నిఘా నీడలో 10వేల మందికి పైగా భారత ప్రముఖులు

సాక్షి, న్యూఢిల్లీ : గత రెండు నెలలుగా భారత్‌ సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడుతున్న పొరుగు దేశం చైనా తన వక్రబుద్ధిని మరోసారి ప్రదర్శించింది. సరిహద్దుల్లో భారత సైనిక శౌర్యాన్ని ఎదిరించలేని డ్రాగాన్‌ దొంగదెబ్బ తీసేందుకు కుట్రపన్నింది. ఓ వైపు ఇరుదేశాల సరిహద్దుల నడుమ ఉద్రిక్త పరిస్ధితులు ఉన్న తరుణంలోనే దేశంలోని ప్రముఖ నేతలపై రహస్యంగా నిఘా పెట్టి సాంకేతిక యుద్ధానికి తెరరేపింది. దేశంలోని 10వేల మంది ప్రముఖలు, భారత్‌కు చెందిన కీలక సంస్థలపై చైనా గూడాచార విభాగం నిఘా పెట్టింది. ఈ మేరకు ఓ జాతీయ పత్రిక సోమవారం సంచలన కథనాన్ని ప్రచురించింది. (చైనా చిత్తశుద్ధి ప్రదర్శించాలి)

నిఘా సంస్థలతో చైనా ఒప్పందం
వివరాల ప్రకారం.. భారత్‌ను దొంగ దెబ్బ తీసేందుకు జిత్తుల మారి చైనా మరోసారి బరితెగించింది. సరిహద్దుల్లో​ తన కుట్రలు విచ్చిన్నం కావడంతో ఏకంగా దేశ నేతలు, ప్రముఖలపై నిఘా పెట్టింది. చైనా నిఘా నీడలో భారత రాష్ట్రపతి, ప్రధాని, అన్ని రాష్ట్రాల సీఎంలతో పాటు అన్ని రాష్ట్రాల మంత్రులు, మాజీ సీఎంలు, కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేతలు ఉన్నట్లు​ జాతీయ పత్రిక ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. చైనాకు చెందిన షేక్‌జేన్‌ అనే గూఢాచర సంస్థతో ఆ దేశ నిఘా విభాగం ఈ మేరకు ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా భారత్‌కు చెందిన ప్రముఖుల సమాచారాన్ని తస్కరించేందుకు మరికొన్ని రహస్య కంపెనీలతో చైనా నిఘా సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. (భారత్‌తో కయ్యం చైనా పన్నాగమే)

మోదీ.. సోనియాలపై నిఘా
భారత్‌లోని ప్రముఖ రాజకీయ, సినీ, వ్యాపార, పారిశ్రామిక, మీడియా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, సాంకేతికరంగంలోని ముఖ్యల వివరాలను సేకరించే పనిలో రసహ్య కంపెనీలు ఇప్పటికే బిజీగా ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు ఆర్మీ అధికారుల సమాచారాన్ని సైతం తెలుసుకునే విధంగా చైనా ఓ ప్రత్యేక విభాగాన్ని తయారుచేసిందని ఆ పత్రిక స్పష్టం చేసింది. సరిహద్దుల్లో సైనిక కార్యకలాపాలతో మొదలు దేశ రహస్యాలనే చేరవేసేందుకు కుట్రలు పన్నినట్లు పేర్కొంది. ఈ జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, సోనియా, రాహుల్‌ గాంధీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, జై శంకర్‌ల డేటాను చోరీ చేయాలని డ్రాగన్‌ వ్యూహరచన చేసినట్లు వెల్లడించింది. 

ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రచురించిన కథనం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఓ వైపు పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమైన తరుణంలోనే చైనా కుట్ర బయటపడటం కలకలం రేపుతోంది. చైనా దురాగతాలు, సరిహద్దుల్లో ఆక్రమణలపై పార్లమెంట్‌లో చర్చించాలని ఇదివరకే ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ చైనా తీరు మార్చుకోకపోవడంతో భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

నిఘా ఎలా?
చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని షెన్జెన్‌లోని టెక్నాలజీ కంపెనీ షెన్హువా డేటా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ లిమిటెడ్ ద్వారా భారత ప్రముఖులపై రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తోందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తన కథనంలో పేర్కొంది. ప్రముఖుల డేటాపై నిఘా ఉంచడానికి ప్రత్యేకంగా ఓవర్‌సీస్ కీ ఇన్ఫర్మేషన్ డేటాబేస్ (ఓకేఐడీబీ) ఆ సంస్థ అభివృద్ధి చేసినట్లు తెలిపింది. షెన్హువా డేటా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీకు చైనా కమ్యూనిస్టు పార్టీ, ఆ దేశ ప్రభుత్వంతో నేరుగా సత్ససంబంధాలు ఉన్నట్లు వెల్లడించింది. దీనిపై ఆరా తీయడానికి బిగ్ డేటా టూల్స్‌ను వినియోగించి రెండు నెలల పాటు ఇన్వెస్టిగేట్ చేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది.

మరిన్ని వార్తలు