సరిహద్దుల్లో శాంతితోనే సత్సంబంధాలు

28 Apr, 2023 05:36 IST|Sakshi
రాజ్‌నాథ్, చైనా మంత్రి షంగ్‌ఫు చర్చలు

చైనా రక్షణ మంత్రికి తేల్చిచెప్పిన రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ: భారత్‌–చైనా మధ్య సత్సంబంధాలు కొనసాగాలంటే సరిహద్దు సమస్యలన్నీ ద్వైపాక్షిక ఒప్పందాలకు లోబడి పరిష్కారం కావాల్సి ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కుండబద్దలు కొట్టారు. గురువారం ఆయన చైనా రక్షణ మంత్రి లి షంగ్‌ఫుతో చర్చలు జరిపారు. తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి(ఎల్‌ఏసీ) మూడేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. శుక్రవారం జరిగే షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీవో) దేశాల రక్షణ మంత్రుల సమావేశం కోసం లి గురువారం ఢిల్లీకి చేరుకున్నారు.

ఈ సందర్భంగా రాజ్‌నాథ్, లి సుమారు 45 నిమిషాలసేపు చర్చలు జరిపారు. ఇరువురు మంత్రులు సరిహద్దు వివాదాలతోపాటు ద్వైపాక్షిక సంబంధాలపై ఎటువంటి దాపరికాలు లేకుండా చర్చలు జరిపినట్లు రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఎల్‌ఏసీ వెంట నెలకొన్న వివాదాలు రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు, హామీలు, ఒడంబడికలకు లోబడి పరిష్కారం కావాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ తెలిపారు. ‘సరిహద్దుల్లో శాంతియుత వాతావరణాన్ని బట్టే రెండు దేశాల మధ్య సంబంధాల కొనసాగింపు ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సరిహద్దు ఒప్పందాల ఉల్లంఘనలతో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని, ఉద్రిక్తతలు సడలిన తర్వాత మాత్రమే బలగాల ఉపసంహరణ ఉంటుందని తెలిపారు’అని రక్షణ శాఖ ఆ ప్రకటనలో వివరించింది.

మరిన్ని వార్తలు