ఐపీఎల్ : ఒమర్ అబ్దుల్లా సెటైర్లు

3 Aug, 2020 10:54 IST|Sakshi
ఫైల్ ఫోటో

ఐపీఎల్ కు చైనా దిగ్గజాలు స్పానర్లు,  ఓమర్ అబ్దుల్లా వ్యంగ్యాస్త్రాలు

ఒకవైపు  చైనా బహిష్కరణ 

మరోవైపు స్పాన్సర్ కంపెనీలుగా చైనా దిగ్గజాలు

శ్రీనగర్: జ‌మ్మూక‌శ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేష‌న‌ల్ కాన్ఫరెన్స్ నేత ఒమ‌ర్ అబ్దుల్లా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్-2020)నిర్వహణకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై స్పందించారు. చైనా కంపెనీలు  ఐపీఎల్ క్రికెట్ టోర్నీ టైటిల్ స్పాన్సర్‌లుగా ఉండటంపై అబ్దుల్లా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (10న ‘ఫైనల్‌’ చేశారు)

వివో సహా ఇతర చైనా కంపెనీలను కొనసాగించాలన్న బీసీసీఐ కౌన్సిల్ నిర్ణయంపై ఒమ‌ర్ అబ్దుల్లా మండిపడ్డారు. ఒకవైపు చైనా వస్తువులను బహిష్కరించాలని ప్రజలకు చెబుతారు మరోవైపు చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజ కంపెనీలను స్పాన్సర్ కంపెనీలుగా కొనసాగిస్తారంటూ విమర్శలు గుప్పించారు. లడాఖ్ సరిహద్దుల్లో చైనా దళాలు మన భూభాగాల్లోకి చొరబడుతుంటే  ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్లుగా వీవోను కొనసాగించడంలో అర్థం లేదన్నారు. చైనీస్ మనీ, ఇన్వెస్ట్ మెంట్, స్పాన్సర్ షిప్, అడ్వర్టైజింగ్ విషయాల నిర్వహణలో ఈ గందరగోళ వైఖరిపై చైనా ముక్కున వేలేసుకోవడంలో ఆశ్చర్యం లేదంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ పరిణామం తరువాత చైనా టీవీలను  బాల్కనీల నుంచి విసిరి పారేసిన వారి మానసిక పరిస్థితిపై ఆయన విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.  పాపం ఇడియట్స్‌ అంటూ అబ్దుల్లా సెటైర్లు వేశారు.  

ఇండియాలో కరోనా మహమ్మారి నేపధ్యంలో యూఏఈలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ తేదీలను బీసీసీఐ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10వరకూ ఐపీఎల్ పోటీలు జరగనున్నాయి. అబుదాబి, దుబాయ్, షార్జాలలో 51 రోజుల పాటు జరగనున్న క్రికెట్ మ్యాచ్ లకు స్పాన్సర్ కంపెనీలుగా చైనా కంపెనీల్ని కూడా ఆమోదించడం విమర్శలకు  తావిస్తోంది. 

మరిన్ని వార్తలు