భారత టీకాపై చైనా హ్యాకర్ల దృష్టి

2 Mar, 2021 04:27 IST|Sakshi

భారత్‌ బయోటెక్, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ల ఐటీ వ్యవస్థలను హ్యాక్‌ చేసే ప్రయత్నాలు

చైనాతో ఉద్రిక్తతల సమయంలో భారత పవర్‌ గ్రిడ్‌పైనా మాల్‌వేర్‌ ప్రయోగం

వెల్లడించిన విదేశీ సైబర్‌ నిఘా సంస్థలు

న్యూఢిల్లీ/వాషింగ్టన్‌/బీజింగ్‌: కోవిడ్‌–19కి టీకా తయారు చేస్తున్న రెండు భారత ఫార్మా కంపెనీలను చైనా హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారని సైబర్‌ నిఘా సంస్థ ‘సైఫర్మా’ వెల్లడించింది. ‘ఏపీటీ 10’, ‘స్టోన్‌ పాండా’ అనే పేర్లున్న ఆ హ్యాకింగ్‌ బృందానికి చైనా ప్రభుత్వం మద్దతుందని పేర్కొంది. ‘భారత్‌ బయోటెక్‌’, ‘సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా’ సంస్థలకు చెందిన ఐటీ వ్యవస్థల్లో, పంపిణీ చైన్‌లో లొసుగులను హ్యాకర్లు గుర్తించారని సింగపూర్, టోక్యోల్లో కార్యాలయాలున్న సైఫర్మా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన కోవిడ్‌–19 టీకాల్లో దాదాపు 60% భారత్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయి.

కోవిడ్‌ –19 వ్యాక్సిన్‌ విషయంలో భారతీయ ఫార్మా ఆధిపత్యాన్ని తగ్గించే లక్ష్యంతో చైనా బృందం ఈ హ్యాకింగ్‌కు పాల్పడుతోందని సైఫర్మా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కుమార్‌ రితేశ్‌ తెలిపారు. వారి ప్రధాన లక్ష్యం ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో పాలు పంచుకుంటున్న సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియానేనన్నారు. సీరం ఇన్‌స్టిట్యూట్‌ పబ్లిక్‌ సర్వర్లు బలహీనమైన వెబ్‌ సర్వర్లపై ఆధారపడి ఉన్నాయని వారు గుర్తించారని రితేశ్‌ తెలిపారు. సైఫర్మా వెల్లడించిన ఈ విషయాలపై సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కానీ, భారత్‌ బయోటెక్‌ కానీ స్పందించలేదు. చైనా విదేశాంగ శాఖ కూడా దీనిపై స్పందించేందుకు నిరాకరించింది.

పవర్‌ గ్రిడ్‌ వ్యవస్థపై దాడి కూడా చైనా పనే
భారత్, చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న సమయంలో భారత్‌లో కీలకమైన పవర్‌ గ్రిడ్‌ వ్యవస్థను మాల్‌వేర్‌తో చైనా హ్యాకర్ల బృందం లక్ష్యంగా చేసుకుందని అమెరికాకు చెందిన మరో సంస్థ తాజాగా వెల్లడించింది. దాంతో, గత సంవత్సరం ముంబైలో ఒక్కసారిగా విద్యుత్‌ సరఫరాలో భారీ  ఆటంకానికి హ్యాకింగే కారణమనే అనుమానాలు తాజాగా తలెత్తాయి. చైనా ప్రభుత్వంతో సంబంధమున్న ‘రెడ్‌ఎకో’ అనే హ్యాకర్స్‌ గ్రూప్‌ భారత్‌  పవర్‌ గ్రిడ్‌ వ్యవస్థను పలుమార్లు లక్ష్యంగా చేసుకుందని అమెరికా సైబర్‌ నిఘా సంస్థ ‘రికార్డెడ్‌ ఫ్యూచర్‌’ తాజాగా వెల్లడించింది. 2020 జూన్‌ నుంచి పలుమార్లు 10 ముఖ్యమైన భారతీయ విద్యుత్‌ సంస్థలపై హ్యాకర్లు దాడి చేశారంది. 

రెండు నౌకాశ్రయాలను కూడా లక్ష్యంగా చేసుకున్నారని తెలిపింది. ‘ప్లగ్‌ ఎక్స్‌ మాల్‌వేర్‌ సీ2’ ద్వారా రక్షణ రంగ సంస్థలతో పాటు ప్రభుత్వ సంస్థలను హ్యాక్‌ చేయడానికి ప్రయత్నించారని పేర్కొంది. కాగా, భారత ‘పవర్‌ సిస్టమ్‌ ఆపరేషన్‌ కార్పొరేషన్‌’ పనితీరుపై ఎలాంటి మాల్‌వేర్‌ దాడి ప్రభావం చూపలేదని, సవాళ్లను ఎదుర్కొనేలా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని విద్యుత్‌ శాఖ ప్రకటించింది. మాల్‌వేర్‌ కారణంగా ఎలాంటి డేటాను కోల్పోలేదని స్పష్టం చేసింది. మరోవైపు, ‘రికార్డెడ్‌ ఫ్యూచర్‌’ ఆరోపణలను చైనా ఖండించింది. భారత పవర్‌ గ్రిడ్‌ను ఆటంకపరిచే హ్యాకింగ్‌ చర్యల్లో తమ పాత్ర ఉందన్న ఆరోపణలను చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ తోసిపుచ్చారు. అక్టోబర్‌ 12న ముంబైలో అకస్మాత్తుగా విద్యుత్‌ సరఫరాకు ఆటంకం ఏర్పడడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోవడం, గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డ విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు