చైనా దూకుడు.. భారత్‌కు పొంచి ఉన్న పెను ముప్పు!

8 Jun, 2022 19:41 IST|Sakshi

డ్రాగన్‌ కంట్రీ చైనా.. ఎప్పుడూ భారత్‌ విషయంలో కవ్వింపులకు పాల్పడుతూనే ఉంటుంది. భారత సరిహద్దుల్లో చైనా అక్రమ నిర్మాణాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. హియాలయాల పొడవునా చైనా నిర్మాణాలు చేపడుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. 

ఇక, లడఖ్ సమీపంలో చైనా మరో వంతెన నిర్మిస్తున్న విషయం శాటిలైట్‌ ఫొటోల ద్వారా బహిర్గతమైంది. ఈ విషయాన్ని అమెరికా ఆర్మీ ప‌సిఫిక్ క‌మాండింగ్ జ‌న‌ర‌ల్‌గా ఉన్న ఛార్లెస్ ఏ ఫ్లిన్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో చైనా దూకుడు పట్ల భారత్‌ను ఆయన హెచ్చరించారు. లడఖ్‌లో జ‌రుగుతున్న నిర్మాణాలు క‌ళ్లు బైర్లు క‌మ్మే రీతిలో ఉన్న‌ట్లు ఆయ‌న ఆరోపించారు. చాలా ఆందోళ‌నక‌ర రీతిలో నిర్మాణ ప‌నులు జ‌రుగుతున్న‌ట్లు ఆయ‌న ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేశారు. చైనా వైఖ‌రిని తీవ్రంగా త‌ప్పుప‌ట్టిన చార్లెస్‌.. చైనా తన మిలిటరీ వనరులు అన్నింటినీ పెంచుకుంటుందని అన్నారు. చైనా కదలికలు ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి ఏమాత్రం ప్రయోజకరంకాదన్నారు. 

చైనా విధానాలు హిమాల‌య స‌రిహ‌ద్దులో చాలా ఆందోళ‌న‌క‌రీతిలో ఉన్నాయని తెలిపారు. వెస్ట్ర‌న్ థియేట‌ర్ క‌మాండ్ వాళ్లు నిర్మిస్తున్న క‌ట్ట‌డాలు ఆందోళ‌న‌క‌రంగా ఉన్న‌ట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో, చైనా చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా, భారత్ కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఫ్లిన్ అభిప్రాయపడ్డారు. కాగా, ఈ అమెరికా సైనిక జనరల్ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. తాజాగా ఆర్మీ చీఫ్ మనోజ్ పాండేతో సమావేశమయ్యారు.

ఇది కూడా చదవండి: ఆర్ధిక పాఠాలు నేర్చుకుంటున్న శ్రీలంక... పొదుపు దిశగా అడుగులు

మరిన్ని వార్తలు