'గత్యంతరం లేకే జేడీయూతో పనిచేశాం'

6 Oct, 2020 11:04 IST|Sakshi

బీజేపీతో 'ఫ్రెండ్లీ'.. నితీష్‌తో టఫ్‌ ఫైట్‌: చిరాగ్‌ 

సాక్షి, న్యూఢిల్లీ: బిహార్‌ సీఎం, జేడీయూ చీఫ్‌ నితీష్‌కుమార్‌పై లోక్‌ జన శక్తి పార్టీ(ఎల్‌జేపీ) అధినేత చిరాగ్‌ పాశ్వాన్‌ నేరుగా విమర్శలు గుప్పించారు. నితీష్‌పై వ్యక్తిగతంగా తనకు ఎటువంటి వ్యతిరేకత లేదని చెబుతూనే.. ఆయన పాలసీలు, వర్కింగ్‌ స్టైల్‌ను తప్పుబట్టారు. ఇన్నాళ్లూ ఆయనతో తప్పనిసరి పరిస్థితుల్లో బలవంతంగా కలిసి పనిచేయాల్సి వచ్చిందని అన్నారు. 'గత ఎన్నికల తర్వాత రాత్రికిరాత్రే ఆర్‌జేడీ-కాంగ్రెస్‌ల కూటమికి గుడ్‌బై చెప్పి ఎన్‌డీఏలో చేరి నితీష్‌ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. ఆయన ఎవరి మాటా వినిపించుకోరని, సొంత అజెండాతో ముందుకు వెళ్తారని మాకు ముందే తెలుసు. కానీ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇనాళ్లూ కలిసి పనిచేశాం' అని చిరాగ్‌ వ్యాఖ్యానించారు (చదవండి: వీడిన చిక్కుముడి.. కుదిరిన ఒప్పందం)

2013లో తాను రాజకీయ ప్రవేశం చేసినప్పటి నుంచే నితీష్‌కుమార్‌ను వ్యతిరేకిస్తున్నానని చిరాగ్‌ గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో జేడీయూతో కలిసి పోటీ చేసే ప్రసక్తే లేదని మరోసారి తేల్చిచెప్పిన చిరాగ్‌.. ఓటర్లు నితీష్‌కు కచ్చితంగా బుద్ధి చెబుతారని అభిప్రాయపడ్డారు. బీజేపీతో కొన్ని చోట్ల 'ఫ్రెండ్లీ ఫైట్‌' ఉంటుందని, కానీ నితీష్‌కుమార్‌పై బలమైన అభ్యర్థినే పోటీకి దించుతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేలా తాము సహకారం అందిస్తామని, నవంబర్‌ 10 తర్వాత 'డబుల్‌ ఇంజిన్‌ గవర్నమెంట్‌'ను చూస్తారని చిరాగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. 


 

మరిన్ని వార్తలు