సైకిల్ .. ఇది మామూలుగా ఉండదు మరి!

14 Jan, 2021 07:54 IST|Sakshi

సైకిల్‌ తొక్కితే ఆరోగ్యంగా ఉంటామని డాక్టర్లు చెబుతారు.. క్రిస్టియన్‌ టాపింగ్స్‌ ఇంకో మాట కూడా చెబుతున్నారు! రోలో తొక్కండి... వాయు కాలుష్యాన్ని పారదోలండీ అని! సైకిల్‌కు, వాయు కాలుష్యానికి సంబంధం ఏమిటనేగా మీ డౌటు? మరి ఈ పండుగ వేళ ఒకసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందామా? ఒక్కసారి ఈ ఫొటో చూడండి. ఏమిటిది! సైకిల్‌లాగే కనిపిస్తోంది. కానీ, ఇది మామూలు సైకిల్‌ మాత్రం కాదు. ఎందుకంటే చక్రాలు కొంచెం భిన్నంగా ఉన్నాయి కాబట్టి! పేరు రోలో! ఈ సైకిల్‌ను తొక్కారనుకోండి.. కాలుష్యం కిల్‌ అవుతుంది. గాలిని చీల్చుకుంటూ వెళ్లే క్రమంలో కొంత గాలి వేగంగా చక్రాల మధ్యలో ఉండే నిర్మాణాల్లోకి వెళుతుంది. కాలుష్యంతో కూడిన గాలి ఒకవైపు నుంచి వెళితే.. పూర్తిగా శుభ్రమైన వాయువు ఇంకోవైపు నుంచి బయటకు వస్తుంది! క్రిస్టియన్‌ టాపింగ్స్‌ అనే బ్రిటన్‌ డిజైనర్‌ దీన్ని తయారు చేశారు. 

ఢిల్లీ కాలుష్యాన్ని చూసి..
ప్రపంచంలోనే ఎక్కువ కాలుష్యమున్న నగరాల్లో ఢిల్లీ ఒకటి. ఈ నేపథ్యంలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు సులువైన మార్గం కోసం ఆలోచనలు చేసిన టాపింగ్స్‌ చివరకు సైకిల్‌ కదిలే వేగాన్ని ఆసరాగా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. చక్రంలో ఏర్పాటు చేసిన నిర్మాణం కోసం పలు విఫల ప్రయత్నాలు చేసి చివరకు తాజా డిజైన్‌ను ఖరారు చేశారు. ఈ చక్రాల ద్వారా ప్రతి కిలోమీటరు దూరానికి దాదాపు 0.665 ఘనపుమీటర్ల గాలి శుభ్రమవుతుందని అంచనా. 


క్రిస్టియన్‌ టాపింగ్స్‌ 

ఆ మ్యాజిక్‌ ఎలా?
చక్రాల మధ్యలో ఉండే నిర్మాణంలో మూడు ఫిల్టర్లు ఏర్పాటుచేశారు. లోఫా (స్పాంజి లాంటిది)తో తయారైన ఫిల్టర్‌ గాల్లోని కొంచెం పెద్దసైజు కాలుష్యకణాలను (పీఎం 10 – 2.5) పీల్చేసుకుంటుంది. ఇళ్లలోని ఎయిర్‌ ప్యూరిఫయర్లలో వాడే హెపా ఫిల్టర్‌ పీఎం 2.5 కణాలతోపాటు టైర్లు, బ్రేక్‌ల నుంచి వెలువడే పొడిని తనలో దాచుకుంటుంది. చివరగా.. యాక్టివేటెడ్‌ కార్బన్‌ ఫిల్టర్‌ కార్బన్‌ డయాక్సైడ్, నైట్రోజన్‌ డయాక్సైడ్, ఓజోన్‌ వంటి విషవాయువులను పీల్చేసుకుంటుంది. ఈ ప్రక్రియ మొత్తం విద్యుత్తు అవసరం లేకుండానే పూర్తి కావడం రోలో విశిష్టత.

కాలుష్యపు కాటు ఇలా..
► 45 లక్షలు: వాయు కాలుష్యం ద్వారా ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలు
► 15 వేల కోట్లు: వాయు కాలుష్యం వల్ల వచ్చే ఆరోగ్య, ఇతర సమస్యల కారణంగా భారత్‌లో జరుగుతున్న నష్టం (రూపాయల్లో)
► 91% : 2019లో వాయుకాలుష్యం సమస్యను ఎదుర్కొన్న జనాభా
► 40,000: పీఎం 2.5 కాలుష్యం కారణంగా ఐదేళ్లు నిండకుండానే మరణిస్తున్న చిన్నారులు (ప్రతి ఏడాది) 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా