Civil Services Day: దేశ ప్రయోజనాలే పరమావధిగా..

22 Apr, 2023 05:06 IST|Sakshi

ప్రజల నమ్మకాన్ని అధికారులు నిలబెట్టుకోవాలి

సివిల్‌ సర్వీసెస్‌ దినోత్సవంలో మోదీ పిలుపు

జిల్లాలకు, సంస్థలకు ఎక్సలెన్స్‌ అవార్డుల ప్రదానం

న్యూఢిల్లీ: ప్రభుత్వ అధికారులు తీసుకొనే ప్రతి నిర్ణయానికీ దేశ ప్రయోజనాలే పరమావధి కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్బోధించారు. మీపై దేశ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోండి అని అధికారులకు సూచించారు. సివిల్‌ సర్వీసెస్‌ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘వికసిత్‌ భారత్‌’ అనే థీమ్‌తో ఈ కార్యక్రమం నిర్వహించారు.

పన్ను చెల్లింపుదారుల సొమ్మును అధికారంలో ఉన్న పార్టీ సొంత ప్రయోజనాల కోసం ఖర్చు చేస్తోందా? లేక దేశ అభివృద్ధి కోసం వెచ్చిస్తోందా? అన్నది విశ్లేషించాల్సిన బాధ్యత సివిల్‌ సర్వీసెస్‌ అధికారులపై ఉందని మోదీ చెప్పారు. జాతి నిర్మాణంలో ఉన్నత స్థాయి అధికారుల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. వారి క్రియాశీల భాగస్వామ్యం లేకపోతే దేశంలో వేగవంతమైన అభివృద్ధి సాధ్యమయ్యేది కాదని అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ అధికారి దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలని వెల్లడించారు. మీరు తీసుకొనే ప్రతి  నిరం్ణయానికి దేశ ప్రగతే ఆధారం కావాలన్నారు. ప్రపంచంలో భారత్‌ ప్రాధాన్యం నానాటికీ పెరుగుతోందని, అధికార యంత్రాంగం సమయం వృథా చేయకుండా దేశ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు.  

 ‘దేశం ప్రథమం, పౌరులు ప్రథమం’
ప్రజల ఆకాంక్షలకు  ప్రభుత్వ పాలనా వ్యవస్థ అండగా నిలవాలని, వారి కలలు సాకారం అయ్యేందుకు ప్రభుత్వ అధికారులు సాయం అందించాలని ప్రధాని మోదీ సూచించారు. వికసిత భారతదేశానికి ఇది అత్యంత కీలకమని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ప్రభుత్వ యంత్రాంగం చుట్టూ ప్రతికూలత ఆవరించి ఉండేదని, అది ఇప్పుడు సానుకూలతగా మారిందని వివరించారు. ‘దేశం ప్రథమం, పౌరులు ప్రథమం’ అనే నినాదంతో ముందుకు సాగుతున్నామని, దేశంలో బలహీనవర్గాల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఉద్ఘాటించారు.

మీ కోసం మీరు ఏం చేసుకున్నారు అనే దాన్నిబట్టి కాకుండా ప్రజల కోసం ఏం చేశారన్న దాన్నిబట్టే మీ పనితీరు, ప్రతిభను గుర్తించవచ్చని సివిల్‌ సర్వీస్‌ అధికారులకు సూచించారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్న గాఢమైన ఆకాంక్షతో పనిచేస్తే చిరస్మరణీయమైన వారసత్వాన్ని మిగిల్చిన వారవుతారని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో భిన్నమైన సిద్ధాంతాలు, భావజాలాలున్న పార్టీలు ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ప్రజల అంచనాలకు తగ్గట్టుగా అధికారులు పనిచేయాలని పేర్కొన్నారు. యువత కలలు ఛిద్రం కావడానికి వీల్లేదన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కొనసాగిన విచ్చలవిడి అవినీతికి అడ్డుకట్ట వేశామని రూ.3 లక్షల కోట్లు అవినీతిపరుల జేబుల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నామన్నారు.

సివిల్‌ సర్వెంట్ల సేవలు ప్రశంసనీయం: రాష్ట్రపతి
‘సివిల్‌ సర్వీసెస్‌ డే’ సందర్భంగా సంబంధిత అధికారులందరికీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి వారి సేవలు ప్రశంసనీయ మంటూ రాష్ట్రపతి ట్వీట్‌ చేశారు. దేశ ప్రగతిలో వారి కృషి, అంకితభావం, సేవలను ప్రశంసించాలంటూ అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. ఏటా ఏప్రిల్‌ 21న కేంద్రం సివిల్‌ సర్వీసెస్‌ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.

మరిన్ని వార్తలు