కోర్టులో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోండి.. న్యాయవాదిపై సీజేఐ ఆగ్రహం

29 Jan, 2024 16:26 IST|Sakshi

న్యూఢిల్లీ: కోర్టు హాల్‌లో ఎలా ప్రవర్తించాలన్నదానిపై చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా(సీజేఐ) డీవై చంద్రచూడ్‌ సోమవారం సుప్రీంకోర్టులో ఓ న్యాయవాదికి క్లాస్‌ పీకారు. ఏ రైలు పడితే అది ఎక్కేయడానికి ఇది రైల్వేస్టేషన్‌ కాదని ఆగ్రహం​ వ్యక్తం చేశారు.  కోర్టు రూమ్‌లో ఎలా మెలగాలన్నదానిపై ముందు మీరు వెళ్లి ఎవరైనా సీనియర్‌ న్యాయవాది వద్ద శిక్షణ తీసుకోండని సూచించారు.  

జ్యుడిషీయల్‌ సంస్కరణలపై తాను వేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని సోమవారం సుప్రీంకోర్టులో ఒక న్యాయవాది ఒక్కసారిగా లేచి సీజేఐ బెంచ్‌ను అడగడం ప్రారంభించాడు. కేసు లిస్ట్‌ కాకుండా మీ వంతు రాకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఇలా మెన్షన్‌ చేయడమేంటని ఆ న్యాయవాదిని సీజేఐ ప్రశ్నించారు. అయినా వినిపించుకోని ఆ న్యాయవాది న్యాయవ్యవస్థలో సంస్కరణలు అత్యంత త్వరగా తీసుకురావాల్సి ఉందని చెప్పసాగాడు.

న్యాయవాది ప్రవర్తన పట్ల ఆగ్రహించిన సీజేఐ అసలు మీరెక్కడ ప్రాక్టీస్‌ చేస్తున్నారని అడిగారు. దీనికి ఆయన సమాధానమిస్తూ హైకోర్టు, దిగువ కోర్టుల్లో చేస్తా అని చెప్పాడు. దీనికి స్పందించిన సీజేఐ మీరు త్వరగా ఒక సీనియర్‌ వద్ద జాయిన్‌ అయి కోర్టు రూమ్‌లో ఎలా మెలగాలో నేర్చుకోండని చురకంటించారు. ఈ నెల ప్రారంభంలోనూ  ఓ అడ్వకేట్‌ సుప్రీం కోర్టులో గొంతు పెంచి మాట్లాడుతుండగా సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. గొంతు తగ్గించి వాదించాలని సూచించారు.  

ఇదీచదవండి.. ఈడీ ఎదుటకు లాలూ 


 

whatsapp channel

మరిన్ని వార్తలు