తెలుగు అభివృద్ధికి సాంకేతికతను వాడుకోవాలి

29 Aug, 2021 04:27 IST|Sakshi

సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ సూచన

మాతృభాష ఉనికి ప్రమాదంలో ఉందని ఆందోళన

అంతర్జాతీయ సదస్సులో మాట్లాడిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు భాష అభివృద్ధికి సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధ్యమైనంత ఎక్కువగా ఉపయోగిం చుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ సూచించారు. ఏ సమాజంలో నైనా భాష, సంస్కృతి, ఒకదానినొకటి పెన వేసుకుని ఉంటాయని, సమాజం మార్పు కోరుతు న్నప్పుడు, తగిన సర్దుబాట్లు చేసుకోకపోతే, సమాజంతో పాటు భాషకూ, సంస్కృతికి తిప్పలు తప్పవన్నారు. కాలానుగుణంగా భాషలో మార్పు రాకపోతే, ఆ భాష, ఆ సంస్కృతి పతనమైన ఘటనలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. శని వారం దక్షిణాఫ్రికా తెలుగు సంఘం, వీధి అరుగు– నార్వేలు ప్రపంచవ్యాప్తంగా 75కు పైగా తెలుగు సంఘాలతో కలసి చేపట్టిన అంతర్జాతీయ సెమినార్‌లో ఆయన మాట్లాడారు.

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు భాష, సంస్కృతి, కీర్తి పతాకను వినువీధుల్లో ఎగురవేస్తున్న తెలుగు తల్లి ముద్దుబిడ్డ లందరికీ వందనాలు అని జస్టిస్‌ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు. క్రీస్తుపూర్వం 400 సంవత్సరం నుంచి ఉనికిలో ఉన్న తెలుగు భాష ఒక ఉద్యమ రూపం దాల్చడానికి ఒకానొక కారణం మహాభార తాన్ని నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడలు తెనుగించ డమేనని వివరించారు. ‘‘ముందుచూపుతో, తగు మార్పులతో ప్రగతి శీలంగా భాషను మలిచిన యుగపురుషుల్లో గిడుగు వేంకట రామ్మూర్తి పంతులు అగ్రగణ్యులు. దాదాపు సమకాలికులైన కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు, గిడుగు రామ్మూర్తిల త్రయం, సాహితీ సామాజిక సంస్కరణలతో తెలుగు భాషను సామాన్య ప్రజల భాషగా మలిచారు.

వాడుక భాష అవసరం గురించి ఆ మహానుభావులు ముందు చూపుతో హెచ్చరించి, విప్లవాత్మక చర్యలు చేపట్టక పోతే, మన తెలుగు భాష నేడు ఈ స్థితిలో ఉండేది కాదు’’అని జస్టిస్‌ ఎన్‌వీ రమణ తెలిపారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో కూడా మాతృభాష ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని రగలించిందని చెప్పారు. అగ్రశ్రేణి సినీనటుడు కావడం వల్లనే ఎన్టీ రామా రావు ముఖ్యమంత్రి కాలేదని, ఊరూరా చైతన్య రథంపై తిరిగి సరళమైన సామాన్యుడి భాషలో మాట్లాడడమే కారణమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు భాషను వధించడంలో తమ వంతు పాత్రను పోషిస్తున్నా యన్నారు. తెలుగు సినిమాలు కూడా ఆంగ్ల సబ్‌ టైటిల్స్‌ చూసి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగును కాపాడే బాధ్యత ప్రసార మాధ్యమాలపై కూడా ఉందని చెప్పారు.

తెలుగు భాషకు గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర ముప్పు పొంచి ఉందని, దాన్ని కాపాడుకోవడానికి మరోసారి ఉద్యమ స్థాయిలో భాషాభిమానులందరూ పూనుకోవాలని పిలుపునిచ్చారు. పోటీని తట్టుకోవాలంటే ఆంగ్లం తప్పనిసరి అని అలాగని తెలుగును విస్మరించ రాదన్నారు. ‘‘ప్రతి ఒక్కరిలో తెలుగంటే గౌరవం పెరగాలి. సగర్వంగా నేను తెలుగువాడినని, నా మాతృ భాష తెలుగని ఎక్కడికెళ్లినా, ఏ పీఠమెక్కినా చెప్పుకోగలగాలి’’ అని జస్టిస్‌ ఎన్‌వీ రమణ తెలిపారు. ఆగస్టు 29న గిడుగు రామ్మూర్తి పంతులు 158వ జయంతి సందర్భంగా జస్టిస్‌ ఎన్‌వీ రమణ నివాళులర్పించారు. తెలుగు భాష అభివృద్ధికి దక్షిణాఫ్రికా తెలుగు సంఘం, వీధి అరుగు చేస్తున్న కృషిని ప్రశంసించారు. మండలి బుద్ధ ప్రసాద్, గరికిపాటి నరసింహారావు, కొలకలూరి ఇనాక్, గిడుగు స్నేహలత, పెట్లూరు విక్రమ్, తరిగోపుల వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు