కోర్టు ఆదేశాలు ‘ఫాస్టర్‌’గా..

1 Apr, 2022 05:29 IST|Sakshi

సాఫ్ట్‌వేర్‌ ప్రారంభించిన సీజేఐ ఎన్‌వీ రమణ

సాక్షి, న్యూఢిల్లీ: న్యాయ ఆదేశాలు జాప్యం కాకుండా వేగంగా కక్షిదారులకు చేరడానికి రూపొందించిన ఫాస్ట్, సెక్యూర్డ్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్‌ రికార్డ్స్‌(ఫాస్టర్‌) సాఫ్ట్‌వేర్‌ను గురువారం సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ ప్రారంభించారు. కోర్టు ఉత్తర్వులు ఎలక్ట్రానిక్‌ మోడ్‌ ద్వారా వేగంగా, సురక్షితంగా చేరేలా రూపొందించిన ఈ సాఫ్ట్‌వేర్‌ ప్రారంభోత్సవ ఆన్‌లైన్‌ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ హేమంత్‌గుప్తా, పలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ మాట్లాడుతూ.. వేగంగా సాఫ్ట్‌వేర్‌ రూపొందించిన నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) అధికారులు, కోర్టు రిజిస్ట్రీని అభినందించారు. ఈ వ్యవస్థ నిమిత్తం దేశవ్యాప్తంగా 1887 ఈ–మెయిల్‌ ఐడీలు సృష్టించారని, సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో ఫాస్టర్‌ సెల్‌ ప్రారంభించారని తెలిపారు. కోర్టు ఆమోదించిన బెయిల్, విడుదలకు సంబంధించిన ప్రోసీడింగ్స్, ఆదేశాలను ఈ–మెయిళ్ల ద్వారా వెంటనే సంబంధిత నోడల్‌ అధికారులకు చేరేలా ఈ సాఫ్ట్‌వేర్‌ చేస్తుందన్నారు.

ధ్రువీకరణ నిమిత్తం డిజిటల్‌ సంతకాలు, సంస్థాగత డిజిటల్‌ సంతకాలు ఉంటాయన్నారు. సమీప భవిష్యత్తులో హార్డ్‌కాపీలు అవసరం ఉన్న అన్ని రికార్డులు పూర్తిగా ఫాస్టర్‌ ద్వారా చేరవేయొచ్చని సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఆశాభావం వ్యక్తం చేశారు. 16.7.2021న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆగ్రా సెంట్రల్‌ జైలులో నిందితుల్ని మూడు రోజుల తర్వాత కూడా విడుదల చేయలేదంటూ పత్రికల్లో వచ్చిన కథనాన్ని సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ ధర్మాసనం సుమోటోగా స్వీకరించింది. న్యాయ ఆదేశాలు త్వరగా చేరకపోవడం వల్ల దోషుల విడుదలలో జాప్యాన్ని గ్రహించిన సీజేఐ జస్టిస్‌ రమణ ఈ సాఫ్ట్‌వేర్‌ రూపకల్పనకు సూచనలు చేశారు.

మరిన్ని వార్తలు