భారత న్యాయ వ్యవస్థ ప్రక్రియపై సీజేఐ కీలక వ్యాఖ్యలు

16 Jul, 2022 21:13 IST|Sakshi

జైపూర్‌: దేశంలో తొందరపాటు, విచక్షణారహితంగా చేసే అరెస్టులు, బెయిల్‌ పొందటంలో ఇబ్బందులు, ట్రయల్స్‌లో దీర్ఘకాలం జైలులో ఉంచటం వంటివి ప్రస్తుతం అత్యవసర సమస్యలుగా పేర్కొన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజుజు, సుప్రీం కోర్టు సీనియర్‌ జడ్జీల సమక్షంలో మాట్లాడారు. ఏ కేసును చూపకుండానే భారత క్రిమినల్‌ జస్టిస్‌ వ్యవస్థలోని ప్రక్రియ ప్రజలకు శిక్షగా అభివర్ణించారు. 

'సవాళ్లు చాలా ఉన్నాయి. మన నేర న్యాయ వ్యవస్థలో ఉన్న ప్రక్రియ ఒక శిక్షగా మారింది. తొందరపాటు, విచక్షణారహితంగా చేసే అరెస్టుల నుంచి.. బెయిల్‌ పొందటంలో ఇబ్బంది, ట్రయల్స్‌లో ఉన్న వారు ఎక్కువ కాలం జైలులో ఉండటం వరకు ఇవన్నీ అత్యవసర సమస్యలే. నేర న్యాయ వ్యవస్థ పరిపాలన సామర్థ్యాన్ని పెంచడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరం. పోలీసులకు శిక్షణ ఇవ్వటం, జైలు వ్యవస్థను ఆధునికీకరించటం వంటి వాటితో పరిపాలన సామర్థ్యాన్ని పెంచవచ్చు.' అని పేర్కొన్నారు జస్టిస్‌ ఎన్‌వీ రమణ. ఈ సమస్యలపై నాల్సా(నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ), లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీలు దృష్టి సారించి ఏ విధంగా పరిష్కరించవచ్చో చూడాలన్నారు. జైళ్లలో మగ్గుతున్న వారిని త్వరితగతిన విడుదల చేసేందుకు 'బెయిల్‌ యాక్ట్‌' తీసుకువచ్చే అంశాన్ని పరిశీలించాలని ఇటీవల సుప్రీం కోర్టు కేంద్రానికి సూచించింది. ప్రస్తుతం ఆ వాదనలను జస్టిస్‌ ఎన్‌వీ రమణ వ్యాఖ్యలు బలపరుస్తున్నట్లు కనిపిస్తోంది.  

రాజకీయ వ్యతిరేకత శత్రుత్వంగా మారకూడదు.. 
రాజకీయ వ్యతిరేకత అనేది శత్రుత్వం, శాసన పనితీరు నాణ్యతపై ప్రభావం చూపే విధంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.  రాజకీయ వ్యతిరేకత శత్రుత్వంగా మారకూడదని సూచించారు. ఇటీవల అలాంటి సంఘటనలు వెలుగు చూశాయని, అవి ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం సూచనలు కావన్నారు. 

ఇదీ చదవండి: Vice President Election 2022: వీడిన సస్పెన్స్‌.. ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్‌ ధన్‌కర్‌

మరిన్ని వార్తలు