తీర్పులే భూషణం: సీజేఐ

1 Jul, 2021 06:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తన విశిష్టమైన తీర్పుల ద్వారా జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ ఎప్పటికీ గుర్తుండిపోతారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు. జూలై 4న పదవీ విరమణ చేయనున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ వీడ్కోలు సభ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ ఎన్‌వీ రమణ మాట్లాడారు. చాలామంది ప్రధాన న్యాయమూర్తులు క్లిష్టమైన కేసుల బాధ్యతను జస్టిస్‌ భూషణ్‌కే అప్పగించేవారని గుర్తుచేశారు. ‘‘నేను సభ్యుడిగా ఉన్న ధర్మాసనం, కమిటీల్లో జస్టిస్‌ భూషణ్‌ ఉన్నారంటే ఎంతో భరోసాగా ఉండేది. జస్టిస్‌ భూషణ్‌ ఇచ్చిన తీర్పుల్లో మానవతా విలువలు, సంక్షేమ విలువలు ప్రతిబింబిస్తాయి. జస్టిస్‌ భూషణ్‌ తన తీర్పులతోనే గుర్తుండిపోతారు’ అని జస్టిస్‌ ఎన్‌వీ రమణ తెలిపారు.  జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ 2016 మే 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. తన పదవీ కాలంలో పలు కీలకమైన తీర్పులు వెలువరించారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి తమ తీర్పు ద్వారా మార్గం సుగమం చేసిన ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్‌ భూషణ్‌ కూడా ఉన్నారు.  

చట్టం రెండు వైపులా పదునున్న కత్తి
చట్టం రెండువైపులా పదునున్న కత్తి లాంటిదని, న్యాయం అందించడమే కాదు, అన్యాయం జరగకుండా చూస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ చెప్పారు. జస్టిస్‌ పీడీ దేశాయ్‌ 17వ స్మారకోపన్యాసంలో ఆయన ‘రూల్‌ ఆఫ్‌ లా’పై మాట్లాడారు. అప్పట్లో బ్రిటిషర్లు, భారతీయులకు వేర్వేరు చట్టాలుండేవని చెప్పారు.  ‘రూల్‌ ఆఫ్‌ లా’ ఏర్పాటు కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చిందన్నారు. కరోనా సంక్షోభంలో ప్రజల రక్షణ నిమిత్తం ‘రూల్‌ ఆఫ్‌ లా’ ఎంత మేరకు ఉపయోగిస్తున్నామో మనల్ని మనం ప్రశ్నించుకోవాలన్నారు. కరోనా మహమ్మారి రాబోయే కాలానికి కర్టెన్‌ రైజర్‌గా భావిస్తున్నానని, ఎక్కడ తప్పు చేస్తున్నామో విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని జస్టిస్‌ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు. చట్టసభలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా న్యాయవ్యవస్థను నియంత్రించలేవని స్పష్టం చేశారు.
 

మరిన్ని వార్తలు