తెలుగుదనాన్ని మర్చిపోకండి

26 Jun, 2022 02:35 IST|Sakshi

అమెరికాలో తెలుగు వారితో సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ

సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలో ఎక్కడ ఉన్నా పుట్టిన ఊరు, మట్టి వాసనలు, వంటలు వాటి గుభాళింపులు, పలకరింపులు, చదువు నేర్పిన గురువులను, పరిసరాలను మరిచిపోవద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ కోరారు. సతీ సమేతంగా అమెరికా పర్యటనలో ఉన్న సీజేఐకి అమెరికా న్యూజెర్సీలోని ఎడిసన్‌లో నార్త్‌ అమెరికా తెలుగు ప్రతినిధులు శుక్రవారం ఆత్మీయ సన్మానం చేశారు. ఈ సందర్భంగా జస్టిస్‌ రమణ మాట్లాడారు.

అమెరికా వంటి దేశాల్లో మన సంస్కృతీ సంప్రదాయాలను మరవకుండా, ఆచార వ్యవహారాలను పెద్దపీట వేస్తూ జీవితాన్ని గడపటం అందరూ గర్వించాల్సిన విషయమని ఆయన కొనియాడారు. “అమెరికాలో 2010–17 మధ్య కాలంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య 85% పెరిగింది. మిగతా ఆసియా భాషలతో పోలిస్తే తెలుగు భాష ప్రథమ స్థానంలో ఉంది’అని ఆయన తెలిపారు. తెలుగు భాషను ఎంతగా గౌరవిస్తామో, ఇతర భాషలను సైతం అదే విధంగా గౌరవించుకోవాలన్నారు.

ఉద్యోగరీత్యా అవసరమైన విషయాలకు మాత్రమే భాష, సంస్కృతులను త్యాగం చేయాల్సి ఉంటుందే తప్ప, దైనందిన జీవితంలో, కుటుంబంలో రోజువారీ కార్యకలాపాల్లో మాతృభాషను వాడటం మరవొద్దని జస్టిస్‌ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు. తెలుగులో చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చనడానికి తానే ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. మాతృభాషలో చదువుకొని న్యాయశాస్త్రంలో ఈ స్థాయికి చేరుకున్నానన్నారు. దేశంలో న్యాయం ఆకాంక్షించే ప్రతీ ఒక్కరికీ సత్వర న్యాయం అందేలా అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ప్రజల అర్జీలను పరిష్కరించేందుకు తగిన సంఖ్యలో కోర్టులు, జడ్జీలనూ నియమించాల్సిన అవసరం ఉందన్నారు.

మరిన్ని వార్తలు