న్యాయవ్యవస్థలో ఖాళీల సత్వర భర్తీ!

5 Sep, 2021 05:45 IST|Sakshi

సమష్టి కృషితోనే సాధ్యం

సన్మాన సభలో సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

సాక్షి, న్యూఢిల్లీ: జ్యుడీషియల్‌లో ఖాళీలు భారీగా పెరిగిపోవడం దేశీయ న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ అభిప్రాయపడ్డారు. ఈ సవాలును ఎదుర్కొనే క్రమంలో కొలిజయం సిఫార్సులను కేంద్రం వేగంగా ఆమోదిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. జాతీయ జ్యుడీషియల్‌ ఇన్‌ఫ్రా కార్పొరేషన్‌ ఏర్పాటు ప్రతిపాదన సిద్ధమవుతోందని, దీనిపై త్వరలో కేంద్రానికి నివేదికనిస్తామని చెప్పారు. బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఏర్పాటు చేసిన సత్కార సభలో ఆయన మాట్లాడారు.

సుప్రీంకోర్టుకు ప్రతిపాదించిన న్యాయమూర్తుల పేర్లను వేగంగా ఆమోదించినందుకు ప్రధానికి, న్యాయమంత్రికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. సుప్రీంకోర్టులో ఖాళీల భర్తీని సత్వరమే పూర్తిచేయాలని తాను భావించానని, ఈ భావన నెరవేరడం ఆనందంగా ఉందని చెప్పారు. అదేవిధంగా ఇటీవలే కొలీజియం పలు హైకోర్టులకు పలువురు జడ్జిల పేర్లను సిఫార్సు చేసిందని, ప్రభుత్వం వీలయినంత త్వరగా వీటికి ఆమోదముద్ర వేస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. అన్ని హైకోర్టుల్లో కలిపి దాదాపు 41 శాతం పదవులు ఖాళీగా ఉన్నాయని, వచ్చే నెలలోపు వీటిలో 90 శాతం నియామకాలు జరగవచ్చని అంచనా వేశారు. ఖాళీల భర్తీలో సహకరించిన కొలీజియం సభ్యులను అభినందించారు.   

మౌలిక వసతుల కల్పన
దేశ న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాల కొరతను తీర్చేందుకు నేషనల్‌ జ్యుడీషియల్‌ ఇ్రన్ఫాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు ప్రతిపాదన సిద్ధమవుతోందని జస్టిస్‌ రమణ చెప్పారు. చాలా కాలంగా మౌలిక సదుపాయాల పెంపుపై తాను దృష్టి పెట్టానని, ఈ సమస్యను ఒక కాలపరిమితితో పరిష్కరించేందుకు నేషనల్‌ జ్యుడీషియల్‌ ఇ్రన్ఫాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఉపయోగపడుతుందని వివరించారు. ఈ విషయంపై దేశవ్యాప్త నివేదిక సేకరణ పూర్తయిందని, త్వరలోనే దీనికి సంబంధించిన ప్రతిపాదన కేంద్ర న్యాయశాఖ మంత్రికి చేరుతుందని తెలిపారు. కార్పొరేషన్‌ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి సహకారం అందుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు న్యాయం అందేలా చర్యలు తీసుకుంటున్నప్పటికీ అధిక వ్యయప్రయాసల వల్ల లక్షలాది మంది ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయించలేకపోతున్నారన్నారు.  

మహిళలను స్వాగతించాలి
పలువురు మహిళలు న్యాయవాదులుగా కొనసాగుతున్నా, వీరిలో చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నతస్థానాలకు చేరుకుంటున్నారని జస్టిస్‌ రమణ అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్రం వచి్చన 75 ఏళ్ల తర్వాత, అన్ని స్థాయిలలో మహిళలకు కనీసం 50% ప్రాతినిథ్యం లభిస్తుందని ప్రతి ఒక్కరు ఆశించారని, కానీ ఎంతో కష్టం తరువాత సుప్రీంకోర్టులో మహిళా జడ్జీల సంఖ్య 11 శాతానికి పెరిగిందన్నారు. న్యాయవాద వృత్తిలోకి మహిళలను మరింత ఎక్కువగా స్వాగతించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహిళా సహోద్యోగులను గౌరవించడంతో పాటు వారి పట్ల హుందాగా వ్యవహరించాలని సూచించారు. పేదలు, మహిళలు, రైతులు, కారి్మకులు, వెనుకబడినవారు తమ చట్టపరమైన హక్కులను వినియోగించుకొనేందుకు సహాయం చేయాలని, సాధ్యమైనప్పుడల్లా ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని చెప్పారు.   

న్యాయవాద వృత్తిలోకి ఆహా్వనం
సామాజిక పరిస్థితుల్లో మార్పు కారణంగా సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయవాదులు, న్యాయమూర్తులు అయ్యేందుకు అవకాశాలు వస్తున్నాయని సీజేఐ చెప్పారు. కానీ ఇప్పటికీ గ్రామీణ, బలహీన వర్గాల నుంచి ఎక్కువ మంది ఔత్సాహికులు న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టట్లేదని  భావిస్తున్నానన్నారు. న్యాయవాద వృత్తి ఇంకా పట్టణ ప్రాంతాలకే పరిమితమైందని, మరింత మంది ఈ వృత్తిలోకి రావాలని ఆయన స్వాగతించారు. సభలో సుప్రీంకోర్టు జడ్జీలు, న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యులు, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ గంటా రామారావు, వైస్‌ చైర్మన్‌ రామజోగేశ్వరరావు, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వైవీ రవిప్రసాద్, వైస్‌ ప్రెసిడెంట్‌ జీఎల్‌ నాగేశ్వరరావు,  తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఎ.నరసింహా రెడ్డి, వైస్‌చైర్మన్‌ కె.సునీల్‌ గౌడ్, తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పొన్నం అశోక్‌ గౌడ్, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు