తదుపరి సీజేఐగా జస్టిస్‌ ఎన్‌వీ రమణ

25 Mar, 2021 02:14 IST|Sakshi

న్యాయశాఖకు ప్రతిపాదన పంపిన సీజేఐ జస్టిస్‌ బాబ్డే

ఉమ్మడి ఏపీ హైకోర్టులో సేవలందించిన జస్టిస్‌ రమణ

అత్యున్నత న్యాయస్థానంలో అత్యున్నత పదవిని చేపట్టనున్న రెండో తెలుగు వ్యక్తి

సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ నూతలపాటి వెంకట రమణ పేరును ప్రతిపాదిస్తూ సీజేఐ జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బాబ్డే కేంద్ర న్యాయశాఖకు లేఖ పంపారు. న్యాయశాఖ పరిశీలన అనంతరం ఆ లేఖ కేంద్ర హోంశాఖకు, ఆ తర్వాత రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్లనుంది. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఎంపిక ప్రక్రియ పూర్తైనట్లు అధికారిక ప్రకటన విడుదల అవుతుంది. ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్‌ 23వ తేదీతో ముగియనుంది.

కాగా ‘‘జస్టిస్‌ ఎన్‌వీ రమణపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నుంచి 2020 అక్టోబర్‌ 6న అందిన ఆరోపణల లేఖపై విచారణ జరిపి తిరస్కరించడమైనది. ఇది పూర్తిగా అంతర్గత విచారణ అయినందున ఆ వివరాలు బహిర్గతం చేయడం సాధ్యం కాదు’’అని సుప్రీంకోర్టు తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.  

తెలుగువారిలో రెండో వ్యక్తి..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్‌ రమణ ఆ పదవి పొందిన తెలుగు వారిలో రెండో వ్యక్తి. అంతకుముందు జస్టిస్‌ కోకా సుబ్బారావు (జూన్‌ 30, 1966– ఏప్రిల్‌ 11, 1967) సుప్రీంకోర్టు తొమ్మిదో ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. జస్టిస్‌ సుబ్బారావు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. జస్టిస్‌ సుబ్బారావు సీజేఐగా ఉన్న సమయంలోనే రాజీనామా చేసి రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేశారు.

ప్రతిపక్షాల అభ్యర్థిగా పోటీ చేసి జాకీర్‌ హుస్సేన్‌ చేతిలో పరాజయం పొందారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో తెలుగు వారైన జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డిలు న్యాయమూర్తులుగా కొనసాగుతున్న విషయం విదితమే. 

పొన్నవరం నుంచి..
కృష్ణా జిల్లా పొన్నవరంలో ఆగస్టు 27, 1957న జస్టిస్‌ ఎన్‌వీ రమణ జన్మించారు. 1983లో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. ఉమ్మడి ఏపీ హైకోర్టు, కేంద్ర, రాష్ట్ర ట్రైబ్యునళ్లు, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ, కార్మిక, ఎన్నికల అంశాల్లో కేసులు వాదించారు. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార కేసులు, క్రిమినల్‌ కేసుల్లో నిపుణుడిగా పేరు పొందారు. పలు ప్రభుత్వ సంస్థలకు ప్యానెల్‌ కౌన్సిల్‌గా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్‌ కౌన్సిల్, క్యాట్, హైదరాబాద్‌లో రైల్వే స్టాండింగ్‌ కౌన్సిల్‌గా వ్యవహరించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అదనపు అడ్వొకేట్‌ జనరల్‌గా సేవలందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా జూన్‌ 27, 2000 నుంచి సెప్టెంబరు 1, 2013 వరకు కొనసాగిన జస్టిస్‌ రమణ కొంతకాలం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. సెప్టెంబరు 2, 2013 నుంచి ఫిబ్రవరి 16, 2014 వరకు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.

ఫిబ్రవరి 17, 2014న పదోన్నతితో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్‌ ఎన్‌వీ రమణ ప్రస్తుతం సుప్రీంకోర్టులో జస్టిస్‌ బాబ్డే తర్వాత అత్యంత సీనియర్‌ న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ(నల్సా) కార్యనిర్వాహక ఛైర్మన్‌గా ఉన్నారు.


  

మరిన్ని వార్తలు