మొదటి భార్య గురించి సీజేఐ చంద్రచూడ్‌ ఆసక్తికర విషయాలు..

27 Aug, 2023 15:04 IST|Sakshi

బెంగళూరు: న్యాయవాద వృత్తిలో సవాళ్లపై ప్రసంగంలో సీజేఐ డీవే చంద్రచూడ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. లాయర్‌ వృత్తికి సమయం గురించి చెప్పే క్రమంలో చనిపోయిన తన మొదటి భార్య గురించిన విషయాలను వెల్లడించారు. ఉపన్యాసంలో భాగం కాకపోయినప్పటికీ బుక్ నాలెడ్జ్‌ కంటే  తన వ్యక్తిగత అనుభవ పాఠాలు విద్యార్థులకు బాగా ఉపయోగపడతాయని తెలిపారు. బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్శిటీ(ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ)లో 31వ స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.  

'చనిపోయిన నా మొదటి భార్య లాయర్‌గా పనిచేశారు. వృత్తి జీవితంలో ఓ న్యాయవాద సంస్థకు వెళ్లినప్పుడు ఆమె పని గంటల గురించి అడిగారు. అందుకు వారు ఆమెకు 365 రోజులు 24x7 అని సమాధానమిచ్చారు. కుటుంబానికి సమయం లేదని చెప్పారు. భార్యాపిల్లలు ఉన్నవారి పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించినప్పుడు.. ఇంటి పనులు చేసే భర్తను వెతుక్కోండని చెప్పారు' అని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు.

కానీ ప్రస్తుతం పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయని సీజేఐ చంద్రచూడ్‌ తెలిపారు. పనిచేసే ప్రదేశంలో మహిళలకు స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరాన్ని తెలిపారు. నేడు మహిళా క్లర్కులు బుుతుసమస్యల సమయంలో వర్క్ ఫ్రం హోమ్ చేయగలుగుతున్నారని చెప్పారు. సమాన అవకాశాలు ఉన్నచోట అన్ని అవసరాలను బహిరంగంగా అడగగలిగే పరిస్థితులను కల్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 

ఇటీవల మహిళల గౌరవానికి భంగం కలిగించకుండా, వారి ఆత్మగౌరవాన్ని మరింత పెంచేలా సుప్రీంకోర్టు డిక్షనరీని కూడా మార్చినట్లు చెప్పారు. వేశ్య, పతిత, హౌజ్‌వైఫ్‌ వంటి పదాలను తొలగించినట్లు స్పష్టం చేశారు. మహిళా సాధికారతను సాధించే దిశగా సీజేఐ చంద్రచూడ్ ఎన్నో తీర్పులను ఇచ్చారు. ఆర్మీలో శాశ్వత మహిళా కమిషన్, శబరిమలకు మహిళల ప్రవేశంతో పాటు అబార్షన్‌ చట్టాలను కూడా చక్కదిద్దారు. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసును కూడా ఆయన నేతృత్వంలోని ధర్మాసనమే విచారణలు జరుపుతోంది.   

ఇదీ చదవండి: అంబానీ కుటుంబంలో మొదటి ప్రేమ వివాహం ఎవరిది?


 

మరిన్ని వార్తలు