మాట నిలబెట్టుకున్న సీఎం.. టెన్త్‌, ఇంటర్‌ టాపర్లకు హెలికాప్టర్‌ రైడ్‌

8 Oct, 2022 17:44 IST|Sakshi

రాయ్‌పూర్‌: టెన్త్‌, ఇంటర్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి హెలికాప్టర్‌ రైడ్‌ కల్పిస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌. రాష్ట్ర, జిల్లా స్థాయిలో టాపర్లుగా నిలిచిన వారిని హెలికాప్టర్‌లో తనతో పాటు తీసుకెళ్లి గగన విహారం చేయించారు. తొలిసారి హెలికాప్టర్‌ ఎక్కిన క్రమంలో విద్యార్థుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. చాలా సంతోషంగా ఉందని, ఈ రైడ్‌ ద్వారా ఇతర విద్యార్థుల్లోనూ ఉత్సాహం నింపినట్లవుతుందన్నారు.  

10, 12వ తరగతి పరీక్షల్లో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 10మంది విద్యార్థులను హెలికాప్టర్‌లో తిప్పుతామని గత మే నెలలో సీఎం భూపేశ్ బఘేల్ హామీ ఇచ్చారు. చదవుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచేందుకు విద్యార్థుల్ని ప్రోత్సహించేలా ఈ ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఇచ్చిన హామీని నెరవేర్చిన సందర్భంగా హెలికాప్టర్‌ రైడ్‌పై ట్వీట్‌ చేశారు. ‘చూడండి పిల్లలు ఎంత ఆనందంగా ఉన్నారో. 10, 12వ తరగతి పరీక్షల్లో ఉత్తమంగా రాణించిన వారిని హెలికాప్టర్‌లో తిప్పుతామని ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నాం. 125 మంది విద్యార్థులు ఈ హెలికాప్టర్‌ రైడ్‌ను ఆస్వాదిస్తారు’ అంటూ సీఎం ట్వీట్‌ చేశారు. మరోవైపు.. విద్యార్థులను ప్రోత్సహించేందుకే ఈ ప‍్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు రాష్ట్ర మంత్రి ప్రేమ్‌సాయి సింగ్‌ టెకమ్‌. ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చామని తెలిపారు.

ఇదీ చదవండి: అధ్యక్ష ఎన్నికల్లో చివరి వరకు కొనసాగుతా: శశిథరూర్‌

మరిన్ని వార్తలు