Climate Transparency Report 2022: భారత్‌ను దెబ్బతీసిన వాతావరణ మార్పులు

21 Oct, 2022 04:42 IST|Sakshi

ఏడాదిలో 15,900 కోట్ల డాలర్ల నష్టం

అంతర్జాతీయ నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ: వాతావరణ మార్పులు మన దేశాన్ని ఆర్థికంగా కూడా తీవ్ర నష్టాన్ని కలుగజేస్తున్నాయి. 2021లో వడగాడ్పులకి భారత్‌కి 15,900 కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని క్లైమేట్‌ ట్రాన్స్‌పరెన్సీ రిపోర్ట్‌–2022 వెల్లడించింది. పర్యావరణం, వాతావరణ మార్పులపై అధ్యయనం చేస్తున్న కొన్ని అంతర్జాతీయ సంస్థలు కలసికట్టుగా ఈ నివేదిక రూపొందించాయి. వ్యవసాయం, నిర్మాణం, తయారీ, సేవా రంగాల్లో ఈ నష్టం వాటిల్లింది. దేశ స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో 5.4% నష్టం జరిగినట్టు ఆ నివేదిక వివరించింది.  

ఆ నివేదికలో ఏముందంటే..!
► మండే ఎండలతో గత ఏడాది దేశంలో 16,700 పని గంటలు వృథా అయ్యాయి. 1990–1999తో పోల్చి చూస్తే 39% పెరిగింది.
► 2016–2021 మధ్య కాలంలో తుపానులు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడి 3.6 కోట్ల హెక్టార్లలో పంటలకి నష్టం వాటిల్లింది. దీంతో రైతన్నలు 375 కోట్ల డాలర్లు నష్టపోయారు.
► దేశంలో 30 ఏళ్లలో వర్షాలు పడే తీరులో ఎన్నో మార్పులు వచ్చాయి. వ్యవసాయం, అటవీ, మత్స్య  ఆర్థిక ప్రభావాన్ని కనబరిచింది.
► 1850–1900 మధ్య కాలంతో పోల్చి చూస్తే భూ ఉష్ణోగ్రతలు 1.1 డిగ్రీల సెల్సియస్‌ పెరిగాయి
► వాతావరణ మార్పుల ప్రభావం అన్ని దేశాలతో పాటు భారత్‌పై రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. నిలువ నీడ లేని వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది.
► వాతావరణ మార్పులతో జరుగుతున్న నష్టాన్ని అరికట్టాలంటే ప్రపంచ దేశాలు భూ ఉష్ణోగ్రతల్ని 2 డిగ్రీల సెల్సియస్‌ కంటే తగ్గించడానికి కృషి చేయాలి. 2015 పారిస్‌ ఒప్పందాన్ని అన్ని దేశాలు వినియోగించడమే దీనికి మార్గం.
► పర్యావరణ మార్పుల్ని కట్టడి చేయాలంటే మనం వాడుతున్న ఇంధనాలను మార్చేసి, పర్యావరణ పరిరక్షణ కోసం చర్యలు చేపట్టాల్సి అవసరం ఉందని ది ఎనర్జీ అండ్‌ రిసోర్సెస్‌ ఇనిస్టిట్యూట్‌లో ఎర్త్‌ సైన్సెస్, క్లైమేట్‌ చేంజ్‌ డైరెక్టర్‌ సురుచి భద్వాల్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు