సీఎంలకు కేజ్రివాల్‌ లేఖ: ప్లీజ్‌ మాకు ఆక్సిజన్‌ పంపండి

24 Apr, 2021 23:02 IST|Sakshi

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్‌ విజృంభణతో ఢిల్లీలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ ఆస్పత్రులన్నీ కరోనా బాధితులతో కిటకిటలాడుతున్నాయి. వారికి వైద్య సేవలు అరకొరగా అందుతున్నాయి. దాంతో పాటు ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ ఆక్సిజన్‌ ఎక్కడెక్కడ నిల్వ ఉందో పంపించాలని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు శనివారం లేఖ రాశారు. ఆక్సిజన్‌ లభ్యత ఉంటే దయచేసి మాకు పంపండి అని కోరుతూ విజ్ఞప్తి చేశారు. 

కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తున్నా అది చాలడం లేదని అరవింద్‌ కేజ్రివాల్‌ పేర్కొన్నారు. తమ దగ్గర ఉన్న వనరులు చాలడం లేదని గుర్తుచేశారు. ఇదే విషయమై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసినట్లు ట్విటర్‌లో కేజ్రివాల్‌ తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. వైరస్‌ బాధితులకు అందించేందుకు ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలోనే లేఖ రాసినట్లు చెప్పుకొచ్చారు.

చదవండి: ఏపీలో ప్రారంభమైన రాత్రి కర్ఫ్యూ.. రోడ్లన్నీ వెలవెల
 

మరిన్ని వార్తలు