రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌‌: సీఎం

24 Oct, 2020 06:09 IST|Sakshi

సీఎం ఎడపాడి పళనిస్వామి వెల్లడి 

చెన్నై ఎయిర్‌పోర్టులో శాశ్వత కరోనా కేంద్రం 

లోకల్‌ రైళ్ల కోసం కేంద్రానికి వినతి

సాక్షి, చెన్నై: కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ వేస్తామని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రకటించారు. అందుకయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. కరోనా వైరస్‌ పరిస్థితులను సమీక్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న సీఎం ఎడపాడి పుదుక్కోట్టైలో అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం గురువారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ కరోనా ప్రభావం ప్రజలను భయాందోళనకు గురిచేసిందని, వేల సంఖ్యలో పాజిటివ్‌కు గురికాగా, మరెందరో ప్రాణాలు కూడా కోల్పోయారని అన్నారు.

ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల వల్ల కరోనా చాలా వరకు తగ్గుముఖం పట్టిందని తెలిపారు. వైరస్‌ మహమ్మారి పూర్తిగా నశించిపోయే వరకు అహర్నిశలు పాటుపడతామని, కరోనా సోకకుండా వ్యాక్సిన్‌పై ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ ఏడాది చివర్లోగా వ్యాక్సిన్‌ మార్కెట్‌లో విడుదల అవతుందని ఆశిస్తున్నామన్నారు. ఆశుభ ఘడియ రాగానే ప్రభుత్వమే పూర్తి ఖర్చును భరించి రాష్ట్ర ప్రజలందరికీ పూర్తి ఉచితంగా వ్యాక్సిన్‌ వేస్తామని చెప్పారు. 

చెన్నై ఎయిర్‌పోర్టులో శాశ్వత కరోనా కేంద్రం 
 కరోనా భయం నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో చెన్నై విమానాశ్రయంలో శాశ్వత కరోనా పరీక్షా కేంద్రాన్ని నెలకొల్పనున్నారు. వందే భారత్‌ విమానాలు మినహా విదేశాల నుంచి విమానాల రాకపోకలు ఇంకా ప్రారంభం కాలేదు. అయితే స్వదేశంలో నలుమూలలకు విమానాలు నడుపుతున్నారు. రైళ్ల సౌకర్యం ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాకపోవడంతో సగటున రోజుకు 17 వేల మందికి పైగా ప్రయాణికులు విమానాలపైనే ఆధారపడుతున్నారు. అయితే ప్రయాణికుల రద్దీకి తగినట్లుగా అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయకపోవడంతో విమానాశ్రయంలో భౌతికదూరం మృగ్యమైంది.

శుక్రవారం 172 విమానాలు సేవలందించగా సెక్యూరిటీ చెకింగ్‌కు ఒకే ఒక కౌంటర్‌ పెట్టడంతో కిక్కిరిసిన విధానంలో ప్రయాణికులు బారులుతీరడం కరోనా వైరస్‌ వ్యాప్తికి దారితీస్తుందనే భయపడుతున్నారు. ఇదిలా ఉండగా, విదేశీ విమానాల పునరుద్ధరణ జరిగేలోగా ఇంటర్నేషనల్‌ విమానాశ్రయంలో శాశ్వత ప్రాతికపదికన కరోనా వైరస్‌ పరీక్షా కేంద్రాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ ఏర్పాటు చేయనుంది. విదేశీ, స్వదేశీ విమానాల్లో వచ్చే ప్రయాణికులను ఈ కేంద్రంలో పరీక్షలు చేసి నగరంలోకి అనుమతిస్తారని తెలుస్తోంది. 

లోకల్‌ రైళ్లకు అనుమతివ్వండి.. కేంద్రానికి సీఎం లేఖ 
లాక్‌డౌక్‌ కారణంగా మార్చి 24వ తేదీ నుంచి నిలిచిపోయిన ఎలక్ట్రిక్‌ లోకల్‌ రైళ్ల సేవల పునరుద్ధరణకు అనుమతి ఇవ్వాలని సీఎం ఎడపాడి రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు శుక్రవారం ఉత్తరం రాసారు. తమిళనాడు రాష్ట్రం నుంచి దక్షిణరైల్వే వివిధ రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతోందని, అయితే వివిధ వర్గాల ప్రజలు విధులకు హాజరయ్యేందుకు ఎంతో అనుకూలమైన లోకల్‌ రైళ్లు మాత్రం ఇంకా నడవడం లేదని తెలిపారు. లాక్‌డౌన్‌ సడలింపులతో బస్సు సేవలు కూడా అందుబాటులోకి వచ్చినందున లోకల్‌ రైళ్లను అనుమతించాలని సీఎం కోరారు. చెన్నైలో ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉండిన మెట్రోరైలు సేవలను 11 గంటల వరకు పొడిగించారు.  

మరిన్ని వార్తలు