Inadvertent Slip Of Tongue: దేశానికి తదుపరి ప్రధాని అమిత్‌ షా?.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

11 May, 2022 14:42 IST|Sakshi

బీజేపీ సీఎం హిమంత శర్మ అనుకోకుండా తప్పులో కాలేశారు. బహిరంగ సభలో టంగ్‌ స్లిప్‌ అవడంతో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచారు. దీంతో కాంగ్రెస్‌ నేతలు సీఎంను టార్గెట్‌ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..?

సీఎం హిమంత శర్మ అసోంలో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను భారత ప్రధానిగా, ప్రధాని నరేంద్ర మోదీని హోం మంత్రిగా సంభోదించారు. ఆయన వ్యాఖ్యలు విన్న సభలోని బీజేపీ నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అయితే, సీఎం అనుకోకుండా నోరుజారారని, ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని బీజేపీకి చెందిన ఓ సీనియర్ నేత సమర్ధించే ప్రయత్నం చేశారు. కానీ, కాంగ్రెస్ మాత్రం ఈ వీడియోలను ట్రోల్ చేస్తూ అధికార బీజేపీ తదుపరి ప్రధాని అభ్యర్థిగా అమిత్ షానే ఎంచుకుందని, ఆయన ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ట్విట్టర్‌లో కామెంట్స్‌ చేసింది.

ఇదిలా ఉండగా.. కాంగ్రెస్‌ అంతకుముందు చోటుచేసుకున్న ఆసక్తికర వ్యాఖ్యలను కూడా జోడించింది. హిమంత శర్మ అసోం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నప్పుడు బీజేపీ ఎంపీ పల్లబ్ లోచన్ దాస్.. శర్మను పదే పదే సీఎం అంటూ సంభోదించారు. కానీ, ఆ సమయంలో అసోం సీఎంగా శర్బానంద సోనోవాల్‌ కొనసాగుతుండటం విశేషం. అయితే, ఎంపీ పల్లబ్‌ వ్యాఖ్యలకు ఆజ్యంపోస్తూ.. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడంతో హిమంత శర్మ సీఎం అయ్యారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో అమిత్‌ షానే ప్రధాని అభ్యర్థి అవుతారని కాంగ్రెస్‌ పరోక్షంగా కామెంట్స్‌ చేసింది.

ఇది కూడా చదవండి: రాజద్రోహంపై సుప్రీం ఆదేశం: లక్ష్మణ రేఖను గౌరవించాలన్న కేంద్ర మంత్రి

మరిన్ని వార్తలు