బీఆర్‌ఎస్‌ ఓవర్‌ టూ ఢిల్లీ.. హస్తినలో బిజీగా సీఎం కేసీఆర్‌

13 Dec, 2022 01:23 IST|Sakshi

రేపు బీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం ప్రారంభం 

కుమారస్వామి, అఖిలేశ్, తేజస్వి తదితరులు పాల్గొనే అవకాశం 

అదేరోజు పార్టీ ఎజెండా, కార్యకలాపాల రోడ్‌మ్యాప్‌ ప్రకటన 

హస్తినతో పాటు ప్రధాన నగరాల్లో భారీగా ఫ్లెక్సీలు, హోర్డింగులు 

ఒకరొకరుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్న పార్టీ ముఖ్య నేతలు 

నాలుగు రోజులు ఢిల్లీలోనే ముఖ్యమంత్రి మకాం! 

జాతీయ చానళ్లతో చర్చలు.. ముఖ్య నేతలు, ప్రముఖులతో భేటీలు! 

ప్రత్యేక విమానంలో హస్తినకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ 

నేటి నుంచి రెండురోజుల పాటు రాజశ్యామల, నవచండీ యాగాలు  

సాక్షి, హైదరాబాద్‌/ సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించడం లక్ష్యంగా భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) దేశ రాజధాని ఢిల్లీలో తొలి అడుగు పెట్టేందుకు శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని సర్దార్‌ పటేల్‌ రోడ్డులో ఈ నెల 14న బీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం ప్రారంభం కానుంది. ఇందుకోసం ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు సోమవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు.

విమానాశ్రయంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు నామా నాగేశ్వర్‌రావు, కె.కేశవరావు, జోగినపల్లి సంతో‹Ùకుమార్, రంజిత్‌రెడ్డి, కేఆర్‌ సురేశ్‌రెడ్డి, రాములు, బడుగుల లింగయ్య యాదవ్‌ తదితరులు స్వాగతం పలికారు. అక్కడినుంచి తుగ్లక్‌ రోడ్‌లోని అధికారిక నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. పార్టీ కార్యాలయ భవన పనులపై ఎంపీలతో చర్చించారు. సీఎం సతీమణి శోభ, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలు మంగళవారం ఉదయం ఢిల్లీకి చేరుకోనున్నారు. 

శృంగేరీ పీఠం ఆధ్వర్యంలో యాగాలు 
మంగళ, బుధవారాల్లో పార్టీ కార్యాలయంలో జరిగే రాజశ్యామల, నవచండీ యాగాల్లో కేసీఆర్‌ సతీసమేతంగా పాల్గొంటారు. మంత్రి వేముల, ఎంపీ సంతోష్‌ కుమార్‌.. వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్‌ తేజతో కలిసి మూడురోజులుగా..యాగాలు, పార్టీ కార్యాలయ ప్రారం¿ోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మొత్తం మూడు హోమ గుండాలను ఏర్పాటు చేశారు. హోమాల్లో పాల్గొనేందుకు శృంగేరీ పీఠం నుంచి 12 మంది రుత్వికులు రానున్నారు. శృంగేరీ పీఠం గోపీశర్మ ఆధ్వర్యంలో ఈ యాగాలు జరగనున్నాయి. యాగశాల ప్రాంతంలో 300 మంది వరకు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. సోమవారం యాగానికి సంబంధించిన ఏర్పాట్లను వేముల, సంతో‹Ùతో పాటు రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి తదితరులు పరిశీలించారు.

మరోవైపు వాస్తుకు అనుగుణంగా కార్యాలయ భవనంలో మార్పులు, చేర్పులు, అందుకు అవసరమైన మరమ్మతులు చేస్తున్నారు. కార్యాలయానికి అవసరమైన ఫరి్నచర్‌ను సైతం ఇప్పటికే అక్కడికి చేర్చారు. నాలుగు రోజుల పాటు కేసీఆర్‌ ఢిల్లీలో మకాం వేసే అవకాశముందని బీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. బీఆర్‌ఎస్‌ తాత్కాలిక కార్యాలయం ప్రారంభం నేపథ్యంలో ఢిల్లీతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ వీధుల్లో ‘కేసీఆర్‌ ఫర్‌ ఇండియా, దేశ్‌ కీ నేత.. కిసాన్‌ కీ భరోసా, అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ అనే నినాదాలతో పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు వెలిశాయి. పార్టీ కార్యకలాపాల విస్తరణలో భాగంగా రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాల్లోనూ బీఆర్‌ఎస్‌ కార్యాలయాలను ప్రారంభించే యోచనలో కేసీఆర్‌ ఉన్నట్లు సమాచారం. 

రాష్ట్రం నుంచి 450 మందికి పైగా ప్రతినిధులు 
ఢిల్లీలో పార్టీ కార్యాలయం ఏర్పాటు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు బీఆర్‌ఎస్‌ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రారం¿ోత్సవానికి రావాల్సిందిగా బీఆర్‌ఎస్‌ కార్యవర్గం, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ ఛైర్మన్లు తదితరులను కేసీఆర్‌ ఇప్పటికే ఆహ్వానించారు. రాష్ట్రం నుంచి 450 మందికి పైగా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేసీఆర్‌ ఆదేశాల మేరకు సోమవారం పలువురు నాయకులు సొంత ఏర్పాట్లు చేసుకుని ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మంగళవారం సాయంత్రానికి మిగతా ఆహా్వనితులు వెళ్లనున్నారు.

ఇదిలా ఉంటే పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి భావ సారూప్య పార్టీలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కూడా ఆహ్వానించారు. జేడీఎస్‌ అధ్యక్షుడు కుమారస్వామితో పాటు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్, బిహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, సినీ నటుటు ప్రకాశ్‌రాజ్‌ తదితరులు హాజరయ్యే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. దీనిపై మంగళవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి తదితరులు ఆహ్వానితులతో సమన్వయం చేస్తున్నట్లు సమాచారం.   

15 మందితో పొలిట్‌బ్యూరో
పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నెల 14న జరిగే సమావేశంలో పార్టీ ఎజెండా, కార్యకలాపాలకు సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను ప్రకటిస్తారు. అదే రోజు మధ్యా హ్నం జాతీయ మీడియాతో జరిగే భేటీలో బీఆర్‌ఎస్‌ పార్టీ దేశ రాజకీయాల్లోకి రావలసిన పరిస్థితి ఎందు కు ఉత్పన్నమైందనే విషయాన్ని వివరించనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కొన్ని జాతీయ చానళ్లు నిర్వహించే ప్రత్యక్ష చర్చల్లో కేసీఆర్‌ పాల్గొనే అవకాశముందని బీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్న నేతలు, వివిధ రంగాలకు చెందిన వారితోనూ కేసీఆర్‌ వరుస భేటీలు ఉండే అవకాశాలు ఉన్నాయి. పార్టీ కార్యకలాపాలను జాతీయ స్థాయిలో వేగవంతం చేసేందుకు 15 మందితో కూడిన పొలిట్‌బ్యూరోను ప్రకటించే అవకాశముంది. వసంత్‌విహార్‌లో నిర్మాణంలో ఉన్న బీఆర్‌ఎస్‌ శాశ్వత కేంద్ర కార్యా లయాన్ని కేసీఆర్‌ పరిశీలిస్తారని తెలిసింది. 

మరిన్ని వార్తలు