KCR Delhi Tour: టీఆర్‌ఎస్‌ కార్యాలయానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన

3 Sep, 2021 08:58 IST|Sakshi
గురువారం ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేస్తున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో శ్రీనివాస్‌గౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, నామా, కేకే, కేటీఆర్, మహమూద్‌ అలీ, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి

మంత్రి, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో కలిసి భూమిపూజ

వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా కార్యక్రమం

పార్టీ శ్రేణులకు గర్వకారణమన్న మంత్రి కేటీఆర్‌

హాజరైన మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు

సాక్షి, న్యూఢిల్లీ: రెండు దశాబ్దాల చరిత్ర కలిగిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ, ఢిల్లీలో కార్యాలయాన్ని నిర్మించుకొని దేశ రాజకీయాల్లో ముద్ర వేసేందుకు సిద్ధమైంది. టీఆర్‌ఎస్‌ ప్రస్థానంలో మరో మైలురాయిగా నిలిచే ఈ భవన నిర్మాణానికి పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ గురువారం శంకుస్థాపన చేశారు. సీఎంతో పాటు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ భూమి పూజ నిర్వహించారు. మధ్యాహ్నం 1:48 గంటలకు పునాదిరాయి వేశారు. వసంత్‌ విహార్‌లో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. 

వచ్చే ఏడాది దసరాలోగా పూర్తి
నిర్మాణ స్థలంలో వేద పండితులు గురువారం ఉదయం 11 గంటల నుంచే శాస్త్రోక్తంగా పూజలు ప్రారంభించారు. మధ్యాహ్నం 1:14 గంటలసమయంలో సీఎం అక్కడికి చేరుకున్నారు. భూమిపూజకు ముందు జరిగిన హోమంలో కేసీఆర్, కేటీఆర్‌లు పాల్గొన్నారు. 2022 దసరాలోగా 1,100 చదరపు మీటర్ల స్థలంలో భవన నిర్మాణాన్ని çపూర్తిచేయాలన్న లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేíసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ భవన నిర్మాణం పూర్తయిన తర్వాత, దేశ రాజధానిలో సొంత కార్యాలయ భవనం నిర్మించుకున్న అతికొద్ది ప్రాంతీయ పార్టీల జాబితాలో టీఆర్‌ఎస్‌ చేరనుంది.

ఉత్కంఠ .. ఉత్సాహం .. ఉద్వేగం
ఢిల్లీలో గత మూడురోజులుగా భారీ వర్షాలు కురవడంతో భూమిపూజ కార్యక్రమం ఎలా జరుగుతుందోనన్న ఉత్కంఠ మంత్రులు, పార్టీ శ్రేణుల్లో నెలకొంది. అయితే పూజా కార్యక్రమం మొదలయ్యే సమయానికి వర్షం తగ్గిపోవడంతో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా అక్కడికి చేరుకున్నారు. కానీ ఢిల్లీ పోలీసుల భారీ బందోబస్తు నేపథ్యంలో కేవలం ప్రస్తుత, మాజీ ప్రజా ప్రతినిధులను మాత్రమే ప్రాంగణంలోకి అనుమతించారు. కేసీఆర్, కేటీఆర్‌లు వచ్చిన సమయంలో కొందరు నేతలు, కార్యకర్తలు బారికేడ్లు తోసుకొని ప్రాంగణంలోనికి వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు నియంత్రించారు. భూమిపూజ సమీప ప్రాంతానికి వెళ్లలేకపోవడంతో వారు ఉద్వేగానికి గురయ్యారు. 

హాజరుకాని హరీశ్, కొప్పుల, తలసాని
    సుమారు మూడు గంటలపాటు ఈ కార్యక్రమం కొనసాగింది. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, మహమూద్‌ అలీ, జగదీశ్వర్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ పాల్గొన్నారు. ఎంపీలు కె.కేశవరావు, కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, సంతోష్‌కుమార్, బండ ప్రకాశ్, కేఆర్‌ సురేశ్‌రెడ్డి, లింగయ్య యాదవ్, నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్‌ రెడ్డి, బీబీ పాటిల్, రంజిత్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాలోత్‌ కవిత, దయాకర్, వెంకటేశ్‌ నేత, రాములు హాజరయ్యారు. వీరితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మి, ఇతర ప్రజా ప్రతినిదులు, పార్టీ నాయకులు ఎల్‌.రమణ, తుమ్మల నాగేశ్వరరావు, మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు. మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లు హాజరుకాలేదు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్లీలు, బ్యానర్లతో ఇండియాగేట్‌ సమీపంలోని తెలంగాణ భవన్, వసంత్‌విహార్, సీఎం అధికారిక నివాసం ఉన్న తుగ్లక్‌రోడ్డు సహా పలు ప్రాంతాలు గులాబీ మయం అయ్యాయి. 

పార్టీ శ్రేణులకు గర్వకారణం: కేటీఆర్‌
    రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొంటూ, చిక్కుముళ్లని విప్పుకుంటూ, తెలంగాణ గల్లీలో ఉద్యమాన్ని సజీవంగా ఉంచుతూనే అటు ఢిల్లీ పవర్‌ కారిడార్లలో లాబీయింగ్‌ ద్వారా తెలంగాణ ఆకాంక్షకు కేసీఆర్‌ విస్తృతంగా మద్దతు కూడగట్టారని కేటీఆర్‌ గుర్తుచేశారు. దక్షిణ భారతదేశానికి సంబంధించి ఢిల్లీలో కార్యాలయం ఏర్పాటు చేస్తున్న తొలి ప్రాంతీయ పార్టీ టీఆర్‌ఎస్‌ కావడం పార్టీ శ్రేణులకు గర్వకారణమని పేర్కొన్నారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్న ప్రొఫెసర్‌ జయశంకర్‌ మాటలను ఉటంకించారు. రెండు దశాబ్దాల తెలంగాణ ఉద్యమ చరిత్రతో పాటు రాష్ట్ర పునర్నిర్మాణ ప్రయాణాన్ని ప్రస్తావించారు.

తన తొలి అడుగే త్యాగంతో మొదలు పెట్టిన కేసీఆర్, ఢిల్లీ మెడలు వంచి ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చారని చెప్పారు. గత ఏడేళ్లుగా రాష్ట్రంలో తెలంగాణ భాష, సంస్కృతులకు పెద్దపీట వేస్తూ ఒక మహత్తరమైన పునర్నిర్మాణ ప్రయాణం దిగ్విజయంగా కొనసాగుతున్నదని అన్నారు. తెలంగాణ సాధన, పునర్నిర్మాణం అనే రెండు చారిత్రక కర్తవ్యాలను విజయవంతంగా నెరవేర్చిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పుడు దేశ రాజధానిలో ఒక గొప్ప కార్యాలయం నిర్మించుకునేందుకు పూనుకుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా, తెలంగాణ నుంచి వచ్చిన వందలాది మంది నాయకులు, కార్యకర్తల నడుమ ఈ కార్యక్రమం ఒక పండుగలా జరిగిందని కేటీఆర్‌ తెలిపారు. 
 

ఎంతో ఆనందంగా ఉంది: మంత్రి వేముల
ఢిల్లీలో తెలంగాణ భవన్‌కు భూమిపూజ చేయడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి చెప్పారు. ఢిల్లీ గడ్డపై గులాబీ జెండాను ఎగురవేయడం మరిచిపోలేని విషయమన్నారు. తెలంగాణలో అమలు అవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, ప్రభుత్వ పనితీరును దేశం నలుమూలల తెలియజేయాల్సిన బాధ్యత టీఆర్‌ఎస్‌ పార్టీపై ఉందని తెలిపారు. ఈ బాధ్యత నిర్వర్తించేందుకు ఢిల్లీలో నిర్మించబోయే తెలంగాణ భవన్‌ ఒక వేదిక కానుందని మంత్రి పేర్కొన్నారు. 
  
ఇదొక చారిత్రక సన్నివేశం 
తెలంగాణ గులాబీ పతాకం ఢిల్లీ గడ్డపై రెపరెపలాడటం ప్రతి తెలంగాణ బిడ్డకు ఒక గొప్ప భరోసాను ఇస్తుంది. దేశ రాజధానిలో పార్టీ కార్యాలయానికి భూమిపూజ ఒక చారి త్రక సన్నివేశం. తెలంగాణ ఉద్యమ చరిత్రతో పాటు టీఆర్‌ఎస్‌ పార్టీ కూడా చరిత్రలో 
శాశ్వతంగా నిలిచిపోతుంది.    – కేటీఆర్‌

మరిన్ని వార్తలు