ఉక్కుపాదం మోపాల్సిందే..!

28 Sep, 2021 02:48 IST|Sakshi

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పష్టీకరణ

రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద ప్రభావంపై సమీక్ష

అధికారుల పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌

హాజరైన సీఎం కేసీఆర్‌.. కేంద్ర నిధులకు వినతి

సాక్షి , న్యూఢిల్లీ: దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని రూపుమాపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తూ ఉక్కుపాదం మోపాల్సిందేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్పష్టంచేశారు. ఆదివారం వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన మంత్రి అమిత్‌ షా.. సోమవారం పలు రాష్ట్రాలతో విడివిడిగా సమావేశమయ్యారు. మావోయిస్టుల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించిన తెలంగాణలోని తాజా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. 1.40 గంటలపాటు జరిగిన ఈ సమీక్షకు సీఎం కేసీఆర్‌తోపాటు డీజీపీ మహేందర్‌ రెడ్డి, గ్రేహౌండ్స్, ఆక్టోపస్‌ ఆపరేషన్స్‌ అదనపు డీజీ కే.శ్రీనివాస్‌ రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

మావోయిస్టుల ప్రభావాన్ని తగ్గించేం దుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రణాళికలు, వ్యూహాలపై డీజీపీసహా రాష్ట్ర ఉన్నతాధికారులు పవర్‌పాయింట్‌  ప్రెజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. సమీక్షలో హోంశాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ భల్లా, ఐబీ చీఫ్‌ అరవిందకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో చెదురుమదురు ఘటనలు
రాష్ట్ర సరిహద్దుల్లో చెదురుమదురు ఘటనలు తప్ప తెలంగాణలో మావోయిస్టుల కదలికలు, కార్యకలా పాలు నామమాత్రంగా ఉన్నాయని అమిత్‌షాకు సీఎం కేసీఆర్‌ చెప్పినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తెలంగాణ సరిహద్దుల్లోని బస్తర్, గడ్చిరోలి ప్రాంతాల్లో మావోయిస్టుల కార్య కలాపాలు, హింసాత్మక ఘటనలు జరుగుతున్న పరిస్థితుల్లో, అప్పుడప్పుడు వారు సరిహద్దులు దాటి వచ్చి తెలంగాణలో హింసకు పాల్పడు తున్నట్లు సీఎం వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో లొంగుబాట్లు సైతం జరుగుతున్నాయని చెప్పినట్లు సమాచారం. సరిహద్దు రాష్ట్రాలు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో మావోయిస్టు కార్యకలాపాలపై నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయడంతో పాటు గతంలో చేపట్టిన విధంగా జాయింట్‌ ఆప రేషన్లు చేపడితే సత్ఫలితాలు వచ్చే అవకాశాలుంటా యని కేంద్రానికి రాష్ట్ర ఉన్నతాధికారులు సూచిం చినట్లు సమాచారం.

కొత్తగా చేరే పరిస్థితుల్లేవు..
గతంలో మారుమూల ప్రాంతాల్లో పేదరికం, వెనుకబాటుతనం, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అం దని కారణంగా రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదం పెరిగిందని, ఈ నేపథ్యంలో గత ఏడేళ్లలో మారు మూల గ్రామాల వరకు అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా చేశామని సీఎం కేసీఆర్‌ కేంద్ర హోంమంత్రికి వివరించినట్లు సమాచారం. అంతే గాక మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు అటవీ ప్రాంతాల్లో మెరుగైన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు పెరి గిన కారణంగా యువత కొత్తగా మావోయిస్టుల్లో చేరే పరిస్థితులు లేవని పేర్కొన్నారని తెలిసింది.

అలాగే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రహదారి వ్యవస్థను మెరుగుపర్చడంతోపాటు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పన చేపట్టాలని సూచించారు. ఆ ప్రాంతాల్లో రోడ్లు, పాఠశాలలు, ఆస్పత్రుల నిర్మాణానికి పూర్తిగా కేంద్రమే నిధులివ్వాలని కేసీఆర్‌ మరోసారి కేంద్రాన్ని కోరారని తెలిసింది. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఆధు నీకరణకు నిధులివ్వాలని, అదనపు కేంద్రబలగా లను కేటాయించాలని కోరినట్లు సమాచారం. కాగా మావోయిస్టులను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన గ్రేహౌండ్స్‌ వంటి బలగాల ప్రత్యక్ష కార్యాచరణతో రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం తగ్గడానికి కారణమైందని గ్రేహౌండ్స్‌ అదనపు డీజీ శ్రీనివాసరెడ్డి వివరించారు.  

మరిన్ని వార్తలు