రైతే జెండా.. ఎజెండా! బీఆర్‌ఎస్‌ కార్యచరణపై కేసీఆర్‌ కసరత్తు

16 Dec, 2022 08:19 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో పార్టీ నిర్మాణం, కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా చేయాల్సిన ఉద్యమం, ఉత్తరాది రాష్ట్రాల్లో కలిసొచ్చే పార్టీలు, సంఘాలు, పార్టీ ప్రధాన ఎజెండా తదితర అంశాలపై బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఉత్తరాదికి చెందిన నేతలు, రైతు సంఘాల నాయకులతో కీలక భేటీలు నిర్వహిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో వ్యవసాయమే ప్రధాన ఆదాయ వనరు, రైతులే కీలకం కావడంతో.. వారి ఎజెండాతోనే ముందుకు పోవాలనే లక్ష్యంతో వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో రైతు ఉద్యమ నిర్మాణం, వ్యవసాయ కేంద్రీకృత అంశాలపై విస్తృత చర్చలు జరుపుతున్నారు. 

ధాన్యం సేకరణ, గోధుమ సాగుపై చర్చలు
రైతు ఎజెండానే తమ తొలి ప్రాధాన్యమని చాటేలా బీఆర్‌ఎస్‌ పార్టీ అనుబంధ సంఘంగా భారత్‌ రాష్ట్ర కిసాన్‌ సమితి (బీఆర్‌ఎస్‌ కిసాన్‌ సెల్‌)ని ఏర్పాటు చేయడంతో పాటు దానికి అధ్యక్షునిగా రైతు సంఘం నేత గుర్నామ్‌ సింగ్‌ చడూనీని కేసీఆర్‌ నియమించిన విషయం తెలిసిందే. తన నియామకంపై కృతజ్ఞతలు తెలియజేసేందుకు.. గుర్నామ్‌ సింగ్‌తో పాటు పంజాబ్, హరియాణాకు చెందిన రైతులు గురువారం తుగ్లక్‌ రోడ్డులోని సీఎం అధికారిక నివా సంలో కేసీఆర్‌తో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఆయన.. ప్రస్తుత ఖరీఫ్‌లో వరి ధాన్యం సేకరణ, దానికి అనుసరిస్తున్న విధానాలు, గోధుమల సాగు లో తలెత్తే సమస్యలు, పంట వ్యర్ధాల దహనం, ప్రభుత్వ విధానాలు, తదితర అంశాలపై చర్చించారు.పంటల సేకరణలో జాతీయ విధానం, మద్దతు ధరలు, వ్యవసాయంలో సంప్రదాయ దేశీయ పద్ధతులకు ప్రోత్సాహం వంటి అంశాలపై అభిప్రాయాలు సేకరించారు. సాగు నీటి రంగంలో తెలంగాణ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, విద్యుత్‌ సంస్కరణలు, వివిధ వృత్తుల వారికి సామాజిక భద్రత వంటి అంశాలపై మాట్లాడినట్లు చెబుతున్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగంలో తెచ్చిన విప్లవాత్మక మార్పులనే జాతీయ స్థాయి లో అమలు చేసేలా ఎజెండాను రూపొందిద్దామని కేసీఆర్‌ స్పష్టం చేసినట్లు తెలిసింది. 

ఒవైసీ భేటీ.. కుమార్తె వివాహానికి ఆహ్వానం!
మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ భేటీ అయ్యారు. తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. బీఆర్‌ఎస్‌ ఏర్పాటుపై ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జాతీయ స్థాయిలో కలిసి ఉద్యమించే అంశాలు, పార్లమెంట్‌లో లేవనెత్తాల్సిన విషయాలపై ఇరువురు నేతలు కాసేపు ముచ్చటించుకున్నారు. 

కిక్కిరిసిన తుగ్లక్‌ రోడ్డు
బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం తర్వాత రెండోరోజు కూడా కేసీఆర్‌కు శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది. పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఇతర సందర్శకుల రాకతో ఆయన బిజీబిజీగా గడిపారు. తెలంగాణ నుంచి వేలాదిగా తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు, ఉత్తరాది నుంచి పెద్దసంఖ్యలో వచ్చిన రైతు సంఘాల నేతలు, ప్రముఖులను పలుకరించిన ముఖ్యమంత్రి వారితో ఫొటోలు దిగారు. సందర్శకుల తాకిడితో తుగ్లక్‌ రోడ్డు పరిసర ప్రాంతాలు జన సందోహంతో కిక్కిరిశాయి. ఇలావుండగా బీఆర్‌ఎస్‌ కార్యాలయం ప్రారంభ కార్యక్రమం ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి పయనమైన నేతలకు విమాన టికెట్ల ధరలు చుక్కలు చూపించాయి. గరిష్టంగా రూ.50 వేల వరకు పలకడంతో చాలామంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. 

ఉద్యమ కార్యాచరణపై త్వరలో ప్రకటన!
రాజస్థాన్‌కు చెందిన రాష్ట్రీయ్‌ లోక్‌తాంత్రిక్‌ పార్టీ (ఆర్‌ఎల్‌పీ) నేషనల్‌ కన్వీనర్, ఎంపీ హనుమాన్‌ బేనివాల్, ఒడిశాకు చెందిన రైతు సంఘం నేత అక్షయ్‌ కుమార్, జహీరాబాద్‌కు చెందిన రైతు నేత ఢిల్లీ వసంత్‌లు కూడా కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఆయా రాష్ట్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వాల విధానాలు, చేయాల్సిన సంస్కరణలు వంటి అంశాలపై లోతుగా చర్చించారు. రైతు సంబంధిత అంశాలపై వివరాలను సేకరించిన కేసీఆర్‌.. త్వరలోనే పార్టీ తరఫున జాతీయ స్థాయి సమావేశం నిర్వహణ, తదనంతరం ఢిల్లీ వేదికగా చేసే ఉద్యమ కార్యాచరణపై ప్రకటన చేద్దామని చెప్పినట్లు తెలిసింది.

ఇదీ చదవండి: స్పీడ్‌ పెంచిన గులాబీ బాస్‌.. ఢిల్లీ వేదికగా త్వరలో కీలక సమావేశం!

మరిన్ని వార్తలు