ఒడిశా ప్రమాదం: సీఎం మమత కీలక నిర్ణయం.. వారికి ప్రభుత్వం ఉద్యోగం!

5 Jun, 2023 18:34 IST|Sakshi

కోల్‌కత్తా: ఒడిశాలోని బాలాసోర్‌ వద్ద ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషాదకర ఘటనలో దాదాపు 275 మంది ప్రయాణీకులు మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ రాష్ట్రానికి చెందిన మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

వివరాల ప్రకారం.. ఒడిషా రైలు ప్రమాదంలో బెంగాల్‌కు చెందిన ప్రయాణీకులు ఎక్కువ సంఖ్యలో మరణించడంతో పాటుగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో సీఎం మమత సోమవారం మాట్లాడుతూ.. ప్రస్తుతం బెంగాల్‌కు చెందిన ప్రయాణికుల్లో 206 మంది గాయపడ్డారు. వీరంతా ఒడిశాలోని వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ఇక, బాధితుల్లో 33 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారంతా కటక్‌ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే, ఈ ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే తమ రాష్ట్రానికి చెందిన మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అలాగే, అవయవాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సైతం ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. 

అలాగే, రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మానసిక, శారీరక గాయాలతో బాధపడుతున్నవారికి నగదు సాయం అందించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు మంగళవారం భువనేశ్వర్‌, కటక్‌ వెళ్లి అక్కడ వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించనున్నట్టు మమత స్పష్టం చేశారు. ఈ సందర్బంగా సీఎం మమతతో పాటుగా మంత్రులు, సీనియర్‌ ఉన్నతాధికారులు తనతో పాటుగా వస్తున్నారని తెలిపారు. బుధవారం బాధిత కుటుంబాలను కలిసి ఎక్స్‌గ్రేషియో చెక్కులతో పాటు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను సైతం ఇవ్వనున్నట్టు వెల్లడించారు. 

ఈ క్రమంలోనే రైలు ప్రమాదం గురించి మరోసారి స్పందించారు. ఈ ప్రమాదం గురించి ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నారు. రాజకీయం చేసేందుకు ఇది సమయం కాదన్నారు. అలాగే, గతంలో జరిగిన రైలు దుర్ఘటనలపై సీబీఐ విచారణ సందర్భాలను మమత గుర్తు చేశారు. వీటిపై ఏళ్లు గడిచినా ఎలాంటి ఫలితం రాలేదన్నారు. రైల్వే సేఫ్టీ కమిషన్‌ సత్వరమే అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, రైలు ప్రమాద ఘటనపై కేంద్రం సీబీఐ విచారణ చేపట్టినట్ట విషయం తెలిసిందే. 

ఇది కూడా చదవండి: ఆ దుర్ఘటనలో కీలకంగా మారనున్న లోకోపైలట్‌ చివరి మాటలు..

మరిన్ని వార్తలు