వీడియో: దీదీ సమక్షంలో ‘జై శ్రీరామ్‌’ నినాదాలు.. ప్రధాని అధికారిక కార్యక్రమంలో హైడ్రామా ఘటన

30 Dec, 2022 15:15 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పబ్లిక్‌గా తన అసహనం ప్రదర్శించారు. ప్రధాని గౌరవ అతిథిగా పాల్గొన్న ఓ అధికారిక కార్యక్రమంలో జరిగిన ఘటనతో కలత చెందిన ఆమె.. వేదిక మీదకు వెళ్లేందుకు నిరాకరించారు. 

పశ్చిమ బెంగాల్‌ హౌరా స్టేషన్‌లో ఇవాళ(శుక్రవారం) వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌(దేశంలో ఏడవది) ప్రారంభ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. తల్లి చనిపోయిన బాధలో ఉండి కూడా  వర్చువల్‌గా ఈ కార్యక్రమానికి హాజరై రైలును ప్రారంభించారు ప్రధాని మోదీ. అయితే.. 

సీఎం మమతా బెనర్జీ స్టేషన్‌ వద్దకు చేరుకున్న సమయంలో.. అక్కడున్న కొందరు జై శ్రీరామ్‌ నినాదాలు చేశారు. భారత్‌ మాతాకీ జై.. జై శ్రీరామ్‌ నినాదాలతో ఆ ప్రాంగణం మారుమోగిపోయింది. దీంతో.. ఆమె అసంతృప్తిగా కనిపించారు. నినాదాలు చేస్తున్న వాళ్లను తదేకంగా చూస్తూ ఉండిపోయారు. వేదిక మీదకు వెళ్లేందుకు ఆమె నిరాకరించారు. అది గమనించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌, గవర్నర్‌ సీవీ ఆనంద బోస్‌ ఆమెను సముదాయించే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. దీంతో.. ప్రభుత్వాధికారులతో కలిసి పక్కనే కుర్చీలో కూర్చున్నారు ఆమె. 

ఇక హౌరా-న్యూ జలపైగురి మధ్య నడిచే వందే భారత్‌ రైలు బయల్దేరే సమయంలోనూ కొందరు జై శ్రీరామ్‌, జై మోదీ నినాదాలు చేశారు. ఆ సమయంలోనూ ఆమె తన అసహనం ప్రదర్శించారు. మరోవైపు .. హీరాబెన్‌ మోదీ కన్నుమూతపై.. సంతాపం తెలిపిన బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ.. విశ్రాంతి తీసుకోవాలంటూ ప్రధాని మోదీకి సూచించారు.  ‘‘తల్లికి మించిది ఏదీ లేదు. ఆమె మీ అమ్మే కాదు.. మా అమ్మ కూడా..! నేను కూడా మా అమ్మని చాలా మిస్ అయ్యాను. మీరు ప్రోగ్రామ్‌లో వర్చువల్‌గా చేరడం మాకు చాలా గౌరవం. కార్యక్రమం తర్వాత  విశ్రాంతి తీసుకోండి’’ అని సూచించారామె.

మరిన్ని వార్తలు