సీఎం నితీష్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ ప్లాన్‌ ఏంటి?

18 Feb, 2023 14:38 IST|Sakshi

పాట్నా: బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ సంచలన కామెంట్స్‌ చేశారు. 2024 ఎన్నికల్లో విపక్షాలు ఏకమైతే బీజేపీకి 100 సీట్లు కూడా రావు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో విపక్షాల పొత్తులపై కాంగ్రెస్‌ పార్టీ చర్చలు మొదలుపెట్టాలని సూచించారు. 

వివరాల ప్రకారం.. పాట్నాలో జరిగిన సీపీఐ-ఎంఎల్‌ జాతీయ సదస్సుకు పలువురు నేతలు హాజరయ్యారు. ఈ క్రమంలో బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఈ సందర్భంగా సీఎం నితీష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం వేచిచూస్తున్నాము. దేశ ప్రధాన మంత్రి పదవిపై నాకు వ్యక్తిగతంగా కోరిక లేదు. మేము మార్పును మాత్రమే కోరుకుంటున్నాము. సమిష్టిగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు ఓకే అని అన్నారు. విపక్షాలను ఏకం చేసే విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ముందుకు రావాలి. భారత్‌ జోడో వంటి ప్రత్యేక కార్యక్రమం చేపట్టిన తర్వాత విపక్షాల ఐక్యత విషయంలో కాంగ్రెస్‌ తొందరగా నిర్ణయం తీసుకోవాలి. గతంలో ఢిల్లీకి వెళ్లి రాహుల్‌, సోనియాను కలిశాము. విపక్షాలు ఏకమైతే బీజేపీని ఓడించడం సాధ్యమే అన్నారు. 

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ మాట్లాడుతూ.. కూటమిలో విభేదాలు ఉంటే సరిచేసుకుంటూ ముందుకుసాగాలని అన్నారు. బీహార్‌లో ప్రతిపక్షాలు ఐక్యంగా పనిచేస్తున్నాయని తెలిపారు. బీహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌.. ప్రాంతీయ పార్టీల అభిప్రాయాలను పరగణలోకి తీసుకుని కాంగ్రెస్‌ పార్టీ ముందుకు సాగాలని సూచించారు.

మరిన్ని వార్తలు