అన్నాడీఎంకేలో కుర్చీ వార్‌

29 Sep, 2020 06:50 IST|Sakshi
అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయానికి వస్తున్న సీఎం ఎడపాడి, డిప్యూటీ సెం పన్నీర్‌సెల్వం

సాక్షి, చెన్నై: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై అన్నాడీఎంకేలో నిప్పు రాజుకుంది. సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం ఎవరికివారు ‘నేనంటే నేనే’ అంటూ వాదులాడుకునే స్థాయికి చేరింది. వివాదానికి తెరదించేలా అక్టోబరు 7న అధికారిక ప్రకటిన చేయనున్నట్లు పార్టీ సోమవారం స్పష్టం చేసింది. చదవండి: (కుష్బూను సందిగ్ధంలో పడేసిన గ్రూపు రాజకీయాలు)

ఎడపాడి, పన్నీర్‌ మాటల యుద్ధం 
చెన్నై రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో సోమవారం పార్టీ కార్యవర్గ సమావేశం రసవత్తరంగా సాగింది. ఎడపాడి, పన్నీర్‌ వర్గాలు రెండుగా విడిపోయి బలప్రదర్శన చేస్తూ తమ నేతలకు స్వాగతం పలికాయి. తమనేతే సీఎం అభ్యర్థి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నందున హోం మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు సీఎం ఎడపాడికి బందోబస్తు పెంచారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఈ సమావేశంలో ఎడపాడి, పన్నీర్‌ మధ్య వాగ్యుద్ధం చోటుచేసుకుంది.

ఈ అంశంపై 11 మందితో మార్గదర్శక కమిటీని వేయాలని పన్నీర్‌ ప్రతిపాదించగా, పార్టీ పరంగానే నిర్ణయం తీసుకోవచ్చు, కమిటీ అవసరం లేదని ఎడపాడి నిరాకరించారు. జయలలిత ఆదేశాల మేరకు సీఎం అయినందున తానే ముఖ్యమంత్రి అభ్యర్థి అని పన్నీర్‌సెల్వం చెప్పగా, మిమ్మల్నే కాదు జయను సైతం సీఎంను చేసింది శశికళేనని ఎడపాడి బదులిచ్చారు. సుమారు ఐదు గంటపాటు సమావేశం జరిగినా ఓ అవగాహనకు రాలేకపోయారు. వచ్చే నెల 7వ తేదీన జరుగనున్న జనరల్‌ బాడీ సమావేశంలో ఎడపాడి, పన్నీర్‌ సంయుక్తంగా ప్రకటన చేస్తారని ఆ పార్టీ అగ్రనేత కేపీ మునుస్వామి మీడియాకు తెలిపారు. 

15 తీర్మానాలు ఆమోదం 
పార్టీ ప్రయోజనాలు, సిద్ధాంతాలకు కట్టుబడి సమష్టిగా పాటుపడదాం, తమిళనాడు ప్రభుత్వానికి కేంద్రం జీఎస్టీ సహా పలు అభివృద్ధి కార్యక్రమాల బకాయిలను చెల్లించాలని, కరోనా కష్టకాలంలో ప్రజల కోసం శ్రమించిన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఆరోగ్య, పోలీస్‌ శాఖలతోపాటు అన్నాడీఎంకే శ్రేణులకు ధన్యవాదాలు, ద్విభాషా విధానం, తమిళనాడులో నీట్‌ పరీక్ష రద్దు తదితర 15 తీర్మానాలను సమావేశంలో ఆమోదించారు.

మరిన్ని వార్తలు