‘కాంగ్రెస్‌ను ఎవరూ కాపాడలేరు’

24 Aug, 2020 16:41 IST|Sakshi

స్వదేశీ గాంధీ చేతికి పగ్గాలు : ఉమాభారతి

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేతల తీరుపై రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు పెను దుమారం రేపడంతో అగ్రనాయకత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది. సీడబ్ల్యూసీ సమావేశంలో తాను సీనియర్‌ నేతలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని రాహుల్‌ వివరణ ఇస్తూ వారిని అనునయిస్తున్నారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత వ్యవహారాలు శ్రుతిమించడంపై బీజేపీ స్పందించింది. కాంగ్రెస్‌ పార్టీని ఎవరూ కాపాడలేరని వ్యాఖ్యానించింది. గతంలో పార్టీ వ్యవహారాలపై జ్యోతిరాదిత్య సింధియా గళమెత్తితే ఆయనను బీజేపీతో​ కుమ్మక్యయ్యారని ఆరోపించారని, ఇప్పుడు గులాం నబీ ఆజాద్‌, కపిల్‌ సిబాల్‌ వంటి సీనియర్‌ నేతలు పార్టీకి పూర్తికాల అధ్యక్షుడిని నియమించాలని డిమాండ్‌ చేస్తే వారినీ బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీని ఇప్పుడు ఎవరూ కాపాడలేరని చౌహాన్‌ పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ కనుమరుగే : ఉమాభారతి
గాంధీ-నెహ్రూ కుటుంబ ఉనికి సంక్షోభంలో పడిందని, వారి రాజకీయ ప్రాబల్యం ముగిసిపోయిందని బీజేపీ సీనియర్‌ నేత ఉమాభారతి అన్నారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ కనుమరుగవుతుందని ఆమె వ్యాఖ్యానించారు. పార్టీ పగ్గాలు ఇక ఎవరికి అప్పగిస్తారనేది చూడాలని, కాంగ్రెస్‌ను తిరిగి విదేశీ శక్తుల చేతిలో కాకుండా స్వదేశీ గాంధీ కనుసన్నల్లో ఉండాలని అన్నారు. మరోవైపు రాహుల్‌ గాంధీ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని పార్టీ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ కోరారు. సీనియర్‌ నేతలు లేఖలు రాయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. కాగా రాహుల్‌ తిరిగి పార్టీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించాలని యూత్‌ కాంగ్రెస్‌ నేతలు కోరారు. మరోవైపు పార్టీ చీఫ్‌ బాధ్యతలను చేపట్టేందుకు రాహుల్‌ సుముఖంగా లేరని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి. చదవండి : సీడబ్ల్యూసీ భేటీలో ప్రకంపనలు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు