Tamil Nadu: పెట్టుబడుల వర్షం.. రూ.29వేల కోట్లతో 49 ఒప్పందాలు

21 Jul, 2021 06:57 IST|Sakshi
వివిధ కంపెనీల ప్రతినిధులు, అధికారులతో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌

సీఎం స్టాలిన్‌ సమక్షంలో సంతకాలు 

తమిళనాడులో పెట్టుబడుల వర్షం కురిసేలా మంగళవారం పారిశ్రామిక ఒప్పందాలు జరిగాయి. రూ.29 వేల కోట్ల విలువైన 49 ఒప్పందాలకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సమక్షంలో పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. 

సాక్షి ప్రతినిధి, చెన్నై: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో కరోనా మహమ్మారిని రూపుమాపేందుకు ప్రాధాన్యతను ఇచ్చిన సీఎం స్టాలిన్‌ ఆ తరువాత అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించారు. అన్నిశాఖల అధికారులతో సమావేశం అవుతూ మార్పులు చేర్పులు చేశారు. ముఖ్యంగా పారిశ్రామిక ప్రగతిలో తమిళనాడును ప్రథమ స్థానంలో నిలపాలని ఆశిస్తూ పలు ప్రణాళికలను సిద్ధం చేశారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో భారీ పెట్టుబడులతో కొత్త పరిశ్రమల స్థాపనకు ఆహ్వానం, తద్వారా ఉద్యోగావకాశాలు కల్పించాలని నిర్ణయించారు.

పెట్టుబడుల ఆకర్షణకు అనేక రాయితీలు ప్రకటించారు. 54వేల మందికి ఉద్యోగావకాశలు దక్కేలా రూ.17వేల కోట్ల అంచనాతో 35 కొత్త ఒప్పందాలపై ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తలు పరస్పరం సంతకాలు చేసుకుని మంగళవారం ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. అలాగే రూ.17,297 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు సాగాయి. చెన్నై గిండిలోని ప్రయివేటు స్టార్‌ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన 35 సంస్థలు సీఎం స్టాలిన్‌ సమక్షంలో ఒప్పందాలు చేసుకున్నాయి.

ఆ తరువాత 14 అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం స్టాలిన్‌ శంకుస్థాపన చేశారు. మొత్తం 35 ఒప్పందాలతో 49 పథకాల ద్వారా రూ.28,508 కోట్ల విలువైన ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నారు. ఈ పథకాల ద్వారా 83,472 మందికి ఉద్యోగాలు దక్కే పరిస్థితి ఏర్పడుతుంది. ఇందులో బాగంగా శ్రీపెరంబుదూరులో వంద ఎకరాల్లో రూ.1000 కోట్ల పెట్టుబడులతో సోలార్‌ ప్యానల్‌ ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి పరిశ్రమను నెలకొల్పనున్నారు. ఇందుకు సంబంధించి అమెరికాకు చెందిన ఒక సంస్థ ఒప్పందం చేసుకుంది. ఈ పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభమైతే రాష్ట్రానికి సమృద్ధిగా విద్యుత్‌ లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. పరిశ్రమల మంత్రి తంగం తెన్నరసు సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు