కేంద్రం ఆర్డినెన్స్ అప్రజాస్వామికం.. మద్దతిచ్చినందుకు స్టాలిన్ గారికి కృతఙ్ఞతలు తెలిపిన కేజ్రీవాల్

1 Jun, 2023 19:24 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా బలాన్ని కూడగట్టే పనిలో విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఈ క్రమంలో తమిళనాడు సీఎం స్టాలిన్ ను కలిసి మద్దతు కోరగా అయన సానుకూలంగా స్పందించినందుకు కేజ్రీవాల్ కృతఙ్ఞతలు తెలిపారు.   

ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం...  
ఢిల్లీలో ఆధిపత్యం కోసం ప్రయత్నించిన కేంద్రానికి సుప్రీం కోర్టులో చుక్కెదురవడంతో ఈ తీర్పుకు వ్యతిరేకంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ బిల్లును ఉభయ సభల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందాలని చూస్తోన్న కేంద్రానికి లోక్ సభలో బిల్లు ఆమోదింప చేయడం పెద్ద కష్టం కాదు. కానీ రాజ్యసభలో ఈ బిల్లు  ఆమోదించబడాలంటే మాత్రం 93గా ఉన్న వారి బలం సరిపోదు. ప్రతిపక్షాల మద్దతు కూడా కావాలి. కానీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎలాగైనా కేంద్రానికి అడ్డుకట్ట వేయాలని కృతనిశ్చయంతో ప్రతిపక్షాలను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. 

ఒక్కొక్కరినీ కలుపుకుంటూ... 
ఇప్పటికే ఈ బిల్లుకు వ్యతిరేకంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ  సీఎం తేజస్వి యాదవ్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ల మద్దతును కూడగట్టిన కేజ్రీవాల్ పంజాబ్ సీఎం భగవంత్ మన్ తో కలిసి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో భేటీ అయ్యి మద్దతివ్వాలని కోరారు. అందుకు స్టాలిన్ కూడా సుముఖంగా స్పందించడంతో కేజ్రీవాల్ ఆయనకు కృతఙ్ఞతలు తెలిపారు. తర్వాతి ప్రయత్నంలో ఢిల్లీ సీఎం జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ ను కూడా కలిసి మద్దతు కోరనున్నారు.   

చదవండి: కర్ణాటక ఫలితాలు ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది..

మరిన్ని వార్తలు