ముఖ్యమంత్రుల మధ్య భూవివాదం

18 Jan, 2021 14:52 IST|Sakshi

ఒక్క అంగుళం వదులుకోమని తేల్చి చెప్పిన కన్నడ సీఎం

సాక్షి, హైదరాబాద్‌: సరిహద్దు రాష్ట్రాల మధ్య వివాదం ఏర్పడింది. దీనిపై ఇద్దరు ముఖ్యమంత్రులు విభిన్న ప్రకటనలు చేశారు. దీంతో రాజకీయంగా హాట్‌ టాపిక్‌గా మారింది. కర్ణాటకలో మరాఠీ మాట్లాడే ప్రాంతాలను తమ రాష్ట్రంలో కలిపేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆదివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే కార్యాలయం ఓ ప్రకటన చేసింది. దానిపై సోమవారం కర్ణాటక బీఎస్‌ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప స్పందించారు. ఒక్క అంగుళం భూమి కూడా వదులుకోవడానికి తాము సిద్ధంగా లేమని సీఎం స్పష్టం చేశారు.

‘‘కర్ణాటకలో మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలో కలిపేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలు దురదృష్టకరం. సమాఖ్య వ్యవస్థకు విరుద్ధం. కర్ణాటకలో కన్నడిగులు, మహారాష్ట్రీయులు సోదరులుగా ఐకమత్యంతో జీవిస్తున్నారు. ప్రజల్లో శాంతికి భంగం కలిగించేలా ఉన్న థాకరే వ్యాఖ్యలను ఖండిస్తున్నా. నిజమైన భారతీయుడిగా సమాఖ్య స్ఫూర్తికి థాకరే గౌరవం ఇవ్వాలి. వాటికి కట్టుబడి ఉండాలని’’ యడియూరప్ప సోమవారం ట్వీట్‌ చేశారు.

ఉద్దవ్‌ ఠాక్రే కార్యాలయం ఆదివారం ఓ ట్వీట్‌ రెండు రాష్ట్రాల మధ్య హాట్‌ టాపిక్‌గా మారింది. ‘‘కర్ణాటకలో మరాఠీ మాట్లాడే కొన్ని ప్రాంతాలను మహారాష్ట్రలో కలిపేందుకు తాము కట్టుబడి ఉన్నాం’ అని ట్వీట్ చేసింది. కర్ణాటక రాష్ట్ర పరిధిలో ఉన్న బెల్గాం తదితర సరిహద్దు ప్రాంతాల్లో మరాఠీ మాట్లాడే ప్రజలు చాలా మంది ఉండగా ఆ ప్రాంతాలను తమ రాష్ట్రంలో చేర్చుకుంటామని మహారాష్ట్ర సీఎం తెలిపారు. ఆ ప్రాంతాలు తమ రాష్ట్రానికి చెందినవేనని, వాటిని మహారాష్ట్రలో కలపాలని ఎన్నాళ్ల నుంచో మహారాష్ట్రలో డిమాండ్‌ ఉంది. ఇదే డిమాండ్‌పై మహారాష్ట్ర ఏకీకరణ సమితి సుదీర్ఘ కాలంగా పోరాడుతోంది. అయితే 1956 జనవరి 17వ తేదీన ఈ ఉద్యమంలో జరిగిన ఘర్షణల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ జనవరి 17వ తేదీని మరాఠా అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా చేస్తున్నారు. ఈక్రమంలో ఆదివారం సీఎం ఉద్ధవ్ ఠాక్రే కార్యాలయం ఆ ట్వీట్ చేసింది. కర్ణాటక అధీనంలోని మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలో కలపడమే అమరవీరులకు తాము అందించే ఘన నివాళి అని పేర్కొంది.

మరిన్ని వార్తలు