పవార్‌ వాఖ్యలను ఖండించిన యడియూరప్ప

18 Nov, 2020 16:12 IST|Sakshi

బెంగళూరు: మరాఠీ మాట్లాడే జనాభా ఉన్న ప్రాంతాలు బెల్గాం (బెలగావి), కార్వార్, నిపానిలను మహారాష్ట్రలో కలుపుకోవాలన్న థాకరే కలను నేరవేర్చుకుందామని అజిత్‌ పవార్ చేసిన వ్యాఖ్యలను కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఖండించారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే వర్థంతి సందర్భంగా మహారాష్ట్ర్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మంగళవారం చేసిన వ్యాఖ్యలు కర్ణాటక, మహారాష్ట్ర నాయకుల మధ్య మాటల యుద్ధానికి నాంది పలికాయి. బుధవారం కేబినెట్‌ సమావేశంలో యడియూరప్ప మాట్లడుతూ.. ‘మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను. మహాజన్ కమిషన్ నివేదికలోని నిర్ణయాలు అంతిమమని ప్రపంచానికి తెలుసు. ఇలాంటి సమయంలో అలా మాట్లడటం సరికాద’ని అన్నారు.

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సౌదీ కూడా మహారాష్ట్ర వాదనలను తిరస్కరించారు. ‘బెలగావి కర్ణాటకలో భాగమని చెప్పిన మహాజన్ నివేదికపై మాకు నమ్మకం ఉంది. అజిత్ పవార్ ఏమి చెబుతున్నారో దీనిపై మేము ఖచ్చితంగా లేఖ రాస్తామ’ని అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి 1966లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మెహర్ చంద్ మహాజన్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేశారు. 1972లో పార్లమెంటుకు మహాజన్ కమిషన్ నివేదిక సమర్పించింది. బెల్గాం (ఇప్పుడు బెలగావి)పై మహారాష్ట్ర వాదనను కమిషన్‌ తిరస్కరించింది. అదే సమయంలో రెండు రాష్ట్రాల మధ్య 250-260 గ్రామాలను ఒక్కొక్కటిగా బదిలీ చేయాలని సిఫారసు చేసింది. కర్ణాటక ఈ నివేదికను అంగీకరించగా, మహారాష్ట్ర నిరాకరిచిండంతో సరిహద్దు సమస్య దశాబ్దాలుగా పరిష్కారం కాలేదు. (చదవండి: కర్ణాటకలో ‘మరాఠ’ బోర్డు చిచ్చు)

మరిన్ని వార్తలు