అలా చేసి ఉండాల్సింది కాదు: మిశ్రా పక్క సీటు వైద్యుడు షాకింగ్‌ వ్యాఖ్యలు

8 Jan, 2023 15:42 IST|Sakshi

ఎయిర్‌ ఇండియాలో జరిగిన మూత్ర విసర్జన ఘటనపై నిందితుడు శంకర్‌ మిశ్రా పక్కసీటు ప్రయాణికుడు చాలా షాకింగ్‌ వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు మిశ్రా పక్కసీటు వ్యక్తి ఆమెరికాకు చెందిన ఆడియాలజీ వైద్యుడు సుగతా భట్టాచార్జీ నాటి దురదృష్టకర ఘటనను గుర్తు చేసుకుంటూ...ఆ రోజు ఆ వృద్ధ మహిళ పట్ల పైలెట్‌ అలా వ్యవహరించి ఉండకూడదన్నారు. ఆయన ఆ ఘటన గురించి పై అధికారులకు ఫిర్యాదు చేసి బాధితురాలికి ఉపశమనం కలిగించేలా ఏదైనా చేసి ఉంటే ఇంతలా చర్చనీయాంశంగా మారేది కాదన్నారు. ఐతే నిందితుడి తండ్రి ఆ రోజు ఎలాంటి అనుచిత ఘటన జరగలేదంటూ.. వాదించిన నేపథ్యంలోనే సుగతా భట్టాచార్జీ నాటి ఘటన గురించి వివరించారు.

ఆ రోజు బాధిత మహిళ చాలా మర్యాదగా వ్యవహరించిందన్నారు. తాను బిజినెస్‌ క్లాస్‌లో 8A సీటులో కూర్చొన్నాని, మిశ్రా 8Cలో  కూర్చొన్నారని చెప్పారు. ఆ రోజు భోజనం చేసిన కొద్దిసేపటికి లైట్లు ఆరిపోయాయని చెప్పారు. ఆ తర్వాత నిందితుడు శంకర్‌ మిశ్రా వృద్ధురాలి సీటు9A  వద్దకు వచ్చి మూత్ర విసర్జన చేశాడు. వాస్తవానికి వాష్‌ రూమ్‌ అతని సీటుకి నాలుగు సీట్ల వెనకాల ఉంది. ఈ హఠాత్పరిణామానికి 9A, 9Cలలో కూర్చొన్న ఇద్దరు ప్రయాణికులు ఇబ్బంది పడటం చూశానని అన్నారు. భట్టాచార్జీ తాను ఆ సమయంలో వాష్‌రూమ్‌కి వెళ్తుండగా.. మిశ్రా తనపై తూలితే.. ఫ్లైట్‌ వేగంగా వెళ్లడంతో అలా పడ్డాడనుకున్నాం, గానీ ఆ తర్వాత అతను చాలా మత్తులో ఉన్నట్లు గమనించి షాక్‌ అయ్యాం అన్నారు.

పాపం ఆ బాధిత మహిళ విమాన సిబ్బందికి ఫిర్యాదు చేయగా..వారు వచ్చి కేవలం సీటును క్లీన్‌ చేసి, షీట్లు మార్చి.. మళ్లీ అక్కడే కూర్చొమన్నారని చెప్పుకొచ్చారు. దీంతో తనకు తన నైతిక బాధ్యత గుర్తుకొచ్చి..మరోక సీటు ఇవ్వాల్సిందిగా సీనియర్‌ హోస్ట్‌కి చెప్పినట్లు పేర్కొన్నారు. ఐతే ఆమె పైలెట్‌ అనుమతి తీసుకోవాలని, తాను అలా చేయాలనని చెప్పినట్లు తెలిపారు. ఆ రోజు ఆ సీటు క్లీన్‌ చేసేంత వరకు రెండు గంటల పాటు ఆ మహిళ అలా నిలబడిపోవాల్సి వచ్చిందని చెప్పారు. తాను వెళ్లి సిబ్బందితో చెప్పడంతో ఆమెకు ఒక సిబ్బంది సీటును కేటాయించారు.

ఆ రోజు బిజినెస్‌ క్లాస్‌లో సీటులు ఖాళీగా ఉన్నా కూడా పైలెట్‌ ఆమెకు మరో సీటు కేటాయించకపోగా..కాసేపటి తర్వాత అదే సీటుకి రావాల్సిందిగా కోరారు. ఐతే ఆమె అందుకు నిరాకరించి..సిబ్బందికి కేటాయించే.. చిన్న సీటులోనే ఉండిపోయిందని చెప్పారు. ఆ సమయంలో పైలెట్‌ సరైన రీతిలో నిర్ణయం తీసుకుని స్పందించి ఉంటే... ఇదంతా జరిగి ఉండేది కాదన్నారు. విమాన సిబ్బంది ఒక స్త్రీ పరువుతో ఆడుకుని, ఎయిర్‌ ఇండియా పరువు దిగజార్చరన్నారు.

ఇదిలా ఉండగా, ముంబై సమీపంలోని బొయిన్‌సర్‌లో ఉంటున్న నిందితుడు మిశ్రా తండ్రి మాత్రం తన కొడుకు అమాయకుడని, తన తల్లి వయసు ఉన్న ఆమెతో అలా వ్యవహరించడంటూ వాదించడం గమనార్హం. కాగా నిందితుడు శంకర్‌ మిశ్రాను శనివారం ఢిల్లీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించింది. అంతేగాదు అతని కస్టడీ కోసం పోలీసుల చేసిన విజ్ఞప్తిని సైతం తిరస్కరించింది. పైగా  బెయిల్ దరఖాస్తును జనవరి 11న పరిశీలిస్తామని ఢిల్లీ కోర్టు పేర్కొంది.

(చదవండి: ఆ ఘటన పట్ల చింతిస్తున్నా! క్షమించండి: ఎయిర్‌ ఇండియా సీఈఓ)
 

మరిన్ని వార్తలు